'బుల్' చల్.. 'బిట్' హిట్!

30 Dec, 2017 01:21 IST|Sakshi

ఒక్క ఇండియానే కాదు. 2017లో యావత్‌ ప్రపంచానిదీ బుల్‌ పరుగే. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ జీవితకాల గరిష్ఠ స్థాయులకు చేరుకున్నాయి. ఏ ఆర్థిక వ్యవస్థకూ తీవ్రస్థాయి కుదుపులు లేవు. మొబైల్‌ విప్లవం కొత్త దశకు చేరింది. దీంతో కొత్త మొబైళ్లొచ్చాయి. చైనా కంపెనీలు విజృంభించాయి. పెద్ద స్క్రీన్లతో యాపిల్‌ తెచ్చిన ఫోన్లూ సూపర్‌హిట్‌. బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది.ప్రపంచం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌వైపు పరిగెడుతోంది. ఆలోచించే రోబోలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. గూగుల్, టెస్లాలు అంతరిక్షంలో కాలనీలు కట్టాలని ఆలోచిస్తున్నాయి.

దేశీయంగా చూస్తే... పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్‌మనీకి, నకిలీలకు అడ్డుకట్ట పడలేదని అర్థమైపోయింది. కాకపోతే డిజిటల్‌ కరెన్సీ వాడకం పెరిగింది. ఆ దెబ్బ తట్టుకుని కోలుకుంటున్న తరుణంలో జీఎస్‌టీ వచ్చి చిన్న వ్యాపారుల్ని కొంత ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఈ రెండింటి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోయినా.. ఏడాది చివరికి వచ్చేసరికి మాత్రం కాస్త కోలుకుంటున్న సంకేతాలు వెలువడ్డాయి. ఇక ఆరంభంలో ధరలు కాస్త శాంతించినప్పటికీ.. ఏడాది చివరికొచ్చేసరికి భయపెట్టే స్థాయికి చేరి.. ఆర్‌బీఐ రేట్ల తగ్గింపునకు అడ్డంకిగా మారాయి.

ఇక మొండి బకాయిలు. వీటిలో మనది ఐదో స్థానం...  ఇన్‌ఫ్రా, మెటల్, విద్యుత్‌ కంపెనీలదే ఈ జాబితాలో అగ్రస్థానం. ఇక ఈ ఏడాది పోతూ పోతూ 2జీ స్పెక్ట్రం కేసు నిందితులకు పెద్ద బోనస్సే ఇచ్చింది. దీన్లో ఎలాంటి అవకతవకలూ లేవంటూ అందరినీ నిర్దోషులుగా కోర్టు వదిలేసింది. ఆయా సంఘటనల సమాహారంతో ‘సాక్షి’  బిజినెస్‌ విభాగం అందిస్తున్న ‘రివైండ్‌–2017’ ఇది..


జనవరి
టాటా గ్రూపునకు మిస్త్రీ స్థానంలో కొత్త ఛైర్మన్‌ వచ్చారు. టీసీఎస్‌ సీఈవో, ఎండీగా పనిచేస్తున్న ఎన్‌.చంద్రశేఖరన్‌ను ఆ పదవిలో నియమించారు. టీసీఎస్‌కు  గోపీనాథన్‌ను నియమించారు.
అంతర్జాతీయంగా పొగాకు పరిశ్రమలో భారీ డీల్‌ సాకారమయింది. రేనాల్డ్స్‌ అమెరికన్‌ను బ్రిటిష్‌ అమెరికన్‌ టొబాకో చేజిక్కించుకుంది.

ఫిబ్రవరి
సంప్రదాయానికి భిన్నంగా 1న కేంద్రం రూ.21.47 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
రూ.16,000 కోట్ల విలువైన నవీ ముంబై ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీవీకే గ్రూపు దక్కించుకుంది.  
భారీ నష్టాల్లో ఉన్న టెలినార్‌ ఇండియాను భారతీ ఎయిర్‌టెల్‌ సొంతం చేసుకుంది.

మార్చి
టాటా మోటార్స్‌ తన తొలి స్పోర్ట్స్‌ కారు ‘రేస్‌మో’ను జెనీవా మోటార్‌ షోలో ఆవిష్కరించింది.
అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌(డీమార్ట్‌) షేర్లు  లిస్టింగ్‌లో చరిత్ర. ఇష్యూ ధర రూ.299తో పోలిస్తే 102 శాతం లాభంతో రూ.604 వద్ద లిస్టయ్యాయి.
’టయోటా’ తన లగ్జరీ బ్రాండ్‌ ’లెక్సస్‌’ను భారత్‌లోకి తీసుకువచ్చింది.

ఏప్రిల్‌
♦  శాంసంగ్‌.. గెలాక్సీ ’ఎస్‌8’, ’ఎస్‌8 ప్లస్‌’లను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది.
భారతీయ మహిళా బ్యాంక్‌సహా ఐదు అనుబంధ బ్యాంకులు మాతృసంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో లాంఛనంగా విలీనమయ్యాయి.
దేశంలో వాహనాలకు సంబంధించి బీఎస్‌–4 నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

మే
టాటా స్టీల్‌ బ్రిటన్‌లోని తన స్పెషాలిటీ స్టీల్‌ వ్యాపారాన్ని లిబర్టీ హౌస్‌ గ్రూపునకు రూ.850 కోట్లకు అమ్మేసింది.
ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌ భారత్‌లో ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించింది.
పేమెంట్స్‌ బ్యాంకు సేవల లైసెన్స్‌ పొందిన పేటీఎం  కార్యకలాపాలు ప్రారంభం.

జూన్‌
 యాహూ .. రెండు దశాబ్దాల ప్రస్థానానికి తెరపడింది. 4.5 బిలియన్‌ డాలర్లకు యాహూను వెరిజాన్‌ కొనుగోలు చేసింది.
 డర్టీ డజన్‌ పై దివాలా చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించాలని బ్యాంకుల్ని ఆర్‌బీఐ ఆదేశించింది.
  కేజీ బేసిన్‌లో రిలయన్స్, బ్రిటిష్‌ పెట్రోలియం ఆరు బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక.

జూలై
  అమల్లోకి జీఎస్‌టీ
  ఈ–కామర్స్‌ కంపెనీ స్నాప్‌డీల్‌ను సొంతం చేసుకోవటానికి ఫ్లిప్‌కార్ట్‌ కుదుర్చుకున్న ఒప్పందం విఫలమయింది.
 జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బెంగళూరు విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి వైదొలిగింది.
 హెచ్‌పీసీఎల్‌లో తనకున్న 51.11% వాటాను ఓఎన్‌జీసీకి విక్రయించడానికి కేంద్రం ఆమోదం.

ఆగస్టు
  ’భారత్‌22’ పేరిట కొత్త ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
 ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ విశాల్‌ సిక్కా అనూహ్యంగా  రాజీనామా. చైర్మన్‌గా నందన్‌ నీలేకని . – ఎస్సార్‌ గ్రూపు... ఎస్సార్‌ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌కు విక్రయించింది.  డీల్‌ విలువ రూ.82,500 కోట్లు.

సెప్టెంబర్‌
 రెగ్యులేటరీ నిబంధనలను పాటించని 2.09 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు.
 హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్‌ ఫార్మాలో 74% వాటా కొంటున్నట్లు చైనా ఫార్మా దిగ్గజం షాంఘై ఫోసున్‌ తెలిపింది. డీల్‌  1.09 బిలియన్‌ డాలర్లు.
  యాపిల్‌ కంపెనీ ‘ఐఫోన్‌–ఎక్స్‌’ను ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.89,000.

అక్టోబర్‌
  ’హువావే’ ప్రపంచంలోనే తొలిసారిగా నాలుగు కెమెరాలతో కూడిన ’హానర్‌ 9ఐ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ధర రూ.17,999.
  ఎస్‌బీఐ చైర్మన్‌గా రజనీష్‌ కుమార్‌ బాధ్యతలు.
   టాటా టెలీసర్వీసెస్‌... తన మొబైల్‌ వ్యాపారాన్ని  ఫ్రీగా భారతీ ఎయిర్‌టెల్‌కు అప్పగించింది.
  బ్యాంకింగ్‌కు రూ.2.11 లక్షల  కోట్లు.

నవంబర్‌
 మూడీస్‌... దేశ సార్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచింది.
  లాజిస్టిక్స్‌ రంగానికి కూడా మౌలిక రంగ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
   మహిళా సదస్సు– జీఈఎస్‌కు  ఆసియాలోనే తొలిసారిగా హైదరాబాద్‌ వేదికైంది. దీనికి ఇవాంకా ట్రంప్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డిసెంబర్‌
  పథకాలు, మొబైల్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించడానికి గడువును కేంద్రం 2018 మార్చి 31 వరకు పొడిగించింది.
♦  ఫెడ్‌ ఫండ్‌ రేటును పావుశాతం పెంచింది. దీంతో మొత్తం ఈ ఏడాది 0.75% రేటు పెరిగినట్లయ్యింది. æ ఎయిర్‌సెల్‌ 6 టెలికం సర్కిళ్లలో  కార్యకలాపాలను 2018 జనవరి 30 నుంచి నిలిపేయనుంది.


సెన్సెక్స్‌ 
34,057
⇒  26,626

నిఫ్టీ
 10,531
⇒  8,186

రూపాయి
 63.80
⇒  67.90

ఆర్‌బీఐ రెపో రేటు
⇒  6.75%
⇒  6.50%
⇒  6.25%
⇒  6.00%

బంగారం 10 గ్రాములు (రూ.లలో)...
⇒  29,390
⇒  28,050

వెండి కేజీ (రూ.లలో)
 38,425
⇒  39,930

బ్రెంట్‌ క్రూడ్‌(బేరల్‌... డాలర్లలో)
 66.26
56.69

బిట్‌ కాయిన్‌ (డాలర్లలో)
 14,064
⇒  1,000

మరిన్ని వార్తలు