ఇటు రెగ్జిట్.. అటు బ్రెగ్జిట్!

20 Jun, 2016 01:16 IST|Sakshi
ఇటు రెగ్జిట్.. అటు బ్రెగ్జిట్!

ఈ వారం మార్కెట్‌పై ప్రభావం
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్‌కంటే ముందు రెగ్జిట్(ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్  వైదొలగడం-రాఘురామ్ ఎగ్జిట్-రెగ్జిట్)  ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతుందని నిపుణులంటున్నారు.  ఆర్‌బీఐ గవర్నర్‌గా రెండోసారి పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేనని రఘురామ్ రాజన్ ప్రకటించడంతో నేడు స్టాక్ మార్కెట్, కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్ ప్రారంభంలో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అటుతర్వాత బ్రెగ్జిట్‌పై ఇన్వెస్టర్లు దృష్టిమళ్లిస్తారని వారన్నారు.

యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలా వద్దా అనే అంశంపై రిఫరెండమ్ ఈ వారంలోనే(జూన్ 23-గురువారం) చోటు చేసుకోవడం అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయంగా కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం బాగానే చూపించవచ్చనేది వారి అభిప్రాయం. వీటికి తోడు నైరుతి రుతుపవనాల విస్తరణ, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. ఈ అంశాలు  కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు.
 
ప్రారంభంలో ప్రతికూల ప్రభావం
ఆర్‌బీఐ గవర్నర్‌గా రెండోసారి రఘురామ్ రాజన్ కొనసాగింపుపై ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో... రెండోసారి గవర్నర్‌గా తాను సుముఖంగా లేనని రాజన్ చెప్పడం స్వల్పకాలంలో స్టాక్‌మార్కెట్, కరెన్సీ, బాండ్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజన్ నిర్ణయం అశుభవార్త అని జియోజిత్ బీఎన్‌పీ పారిబా చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహకర్త వి. కె. విజయ్‌కుమార్ చెప్పారు.

యూరోపియన్ యూనియన్ నుంచి ఇంగ్లాండ్ వైదొలిగే అవకాశాలుండడం, తదనంతర పరిణామాల పట్ల ప్రపంచమంతా ఆందోళనలు నెలకొన్న సమయంలో రాజన్ నిర్ణయం రాంగ్ టైమ్‌లో వచ్చిందని వివరించారు. స్టాక్ మార్కెట్, కరెన్సీ మార్కెట్‌ల నేటి ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే ఈ ప్రతికూల ప్రతిస్పందన స్వల్పకాలమే ఉంటుందని, భారత ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉండడమే దీనికి కారణమని వివరించారు. ఈ ప్రారంభ ప్రతికూల ప్రభావం నుంచి గట్టెక్కగలిగే సత్తా దేశీయ ఆర్థిక వ్యవస్థకు, ఆర్‌బీఐకు ఉన్నాయని నిపుణులంటున్నారు.
 
ఉద్వేగపూరితమైన షాక్..
రాజన్ నిర్ణయం ఉద్వేగపూరిత షాక్‌ను సృష్టిస్తుందని సామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. అయితే ఈ షాక్ నుండి త్వరగానే తేరుకునే పరిపక్వత మార్కెట్లకు ఉందని పేర్కొన్నారు.  రాజన్ తీసుకున్న మంచి నిర్ణయాలను ఆయన తర్వాత వచ్చే గవర్నర్ కొనసాగిస్తారన్న అంచనాలున్నాయని, ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరుకు మరిన్ని మంచి చర్యలు తీసుకోగలరన్న అంచనాలున్నాయని సెంట్రమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఈడీ, కుంజ్ బన్సాల్ చెప్పారు.

రుతుపవనాల విస్తరణ, బ్రెగ్జిట్... ఈ రెండు అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను నిర్ణయిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. బ్రె గ్జిట్ అంశం పూర్తయ్యేవరకూ దేశీయ స్టాక్ మార్కెట్ విదేశీ స్టాక్ మార్కెట్‌ను అనుసరిస్తుందని, ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఒడిదుడుకులమయంగా సాగిన గత వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 10 పాయింట్లు క్షీణించి 26,626 పాయింట్ల వద్ద ముగిసింది.
 
విదేశీ పెట్టుబడులు రూ.4,394 కోట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ నెలలో కూడా విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. వర్షాలు విస్తారంగా కురుస్తాయనే అంచనాలతో ఈ నెల 16వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.4,394 కోట్ల పెట్టుబడులు పెట్టారు.  రూ.1,607 కోట్ల పెట్టుబడులను డెట్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు.
 
‘రెగ్జిట్’ ప్రకంపనలకు సెబీ రెడీ...
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా రాజన్ రెండోవిడత కొనసాగకుండా నిష్ర్కమిస్తూ తీసుకున్న నిర్ణయం(దీన్నే రెగ్జిట్‌గా పిలుస్తున్నారు) దేశీ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మార్కెట్లతో ఏవైనా భారీ హెచ్చుతగ్గులు సంభవిస్తే.. దాన్ని ఎదుర్కోవడానికి సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు తమ నిఘా, నిర్వహణ యంత్రాంగాలను మరింత కట్టుదిట్టం చేశాయి. బ్యాంకులు, ఫారెక్స్ డీలర్లు కూడా డాలర్లకు డిమాండ్ అనూహ్యంగా ఎగబాకితే.. తగిన సరఫరా కోసం సన్నద్ధమవుతున్నారు. రాజన్ వైదొలగడం కారణంగా విదేశీ ఇన్వెస్టర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంటుందని.. బాండ్, స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు