ప్యాకేజీ 3.0 అంచనాలతో లాభాలు

21 May, 2020 01:56 IST|Sakshi

అవసరమైనప్పుడు మరిన్ని చర్యలు 

అభయమిచ్చిన ఆర్థిక మంత్రి 

చివర్లో జోరుగా కొనుగోళ్లు 

సెన్సెక్స్‌ 622 పాయింట్లు జంప్‌

187 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా, హెచ్‌డీఎఫ్‌సీ జోడీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల దన్నుతో మన స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాల్లో ముగిసింది.  ఆర్థిక ప్యాకేజీ 3.0పై ఆశలు చిగురించడం సానుకూల ప్రభావం చూపించింది. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండటం లాభాలను పరిమితం చేసినప్పటికీ, కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటం కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు పతనమైనా మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. సెన్సెక్స్‌ 622 పాయింట్లు లాభంతో 30,819 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 187 పాయింట్లు ఎగసి 9,067 పాయింట్ల వద్ద ముగిశాయి.  

చివర్లో కొనుగోళ్ల హోరు....
సెన్సెక్స్‌ నష్టాల్లో మొదలైనా, ఆ తర్వాత వెంటనే లాభాల్లోకి వచ్చింది. చివరి గంటన్నర వరకూ పరిమిత లాభాల్లో ట్రేడైంది. ఆ తర్వాత లాభాలు జోరుగా పెరిగాయి.  చివర్లో వాహన, బ్యాంక్, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఆరంభంలో 38 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ఆ తర్వాత 682 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 720 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్‌ మార్కెట్లు 1% లాభాల్లో ముగిశాయి.  

► మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 6 శాతం లాభంతో రూ.406 వద్ద  ముగిసింది.  

► మొత్తం 30 సెన్సెక్స్‌ షేర్లలో నాలుగు షేర్లు–ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, హీరో మోటొకార్ప్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్‌ పెయింట్స్‌ నష్టపోగా, మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి.  

► దాదాపు 40కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. భారతీ ఎయిర్‌టెల్, అరబిందో ఫార్మా, ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నా యి.

‘రిలయన్స్‌ ఆర్‌ఈ’ తొలిరోజే 40% అప్‌
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌–రైట్స్‌ ఎన్‌టైటిల్మెంట్‌(ఆర్‌ఐఎల్‌–ఆర్‌ఈ) డీమెటీరియలైజ్‌డ్‌ ట్రేడింగ్‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. రిల3యన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ రూ.53,125 కోట్ల రైట్స్‌ ఇష్యూ బుధవారం మొదలైంది. రైట్స్‌ ఇష్యూకు అర్హులైన వాటాదారులకు రైట్స్‌ ఎన్‌టైటిల్మెంట్‌లను(ఆర్‌ఈ) రిలయన్స్‌ కంపెనీ డీమెటీరియల్‌ రూపంలో జారీ చేసింది. స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల్లో ఈ ఆర్‌ఐఎల్‌–ఆర్‌ఈల ట్రేడింగ్‌ బుధవారమే ఆరంభమైంది. ఇలా ఆర్‌ఈలను డీమ్యాట్‌ రూపంలో జారీ చేయడం, అవి స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల్లో ట్రేడ్‌ కావడం తొలిసారి.  

రూ.158 నుంచి రూ.212కు...
రిలయన్స్‌ ఈ నెల 19న రూ.1,409 వద్ద ముగిసింది. రైట్స్‌ ఇష్యూ ధర రూ.1,257 ఈ రెండిటి మధ్య వ్యత్యాసం... రైట్స్‌ ఎన్‌టైటిల్మెంట్‌ ధరగా (రూ.152) నిర్ణయమైంది. ఎన్‌ఎస్‌ఈలో బుధవారం ఆర్‌ఐఎల్‌–ఆర్‌ఈల ట్రేడింగ్‌ రూ.158 వద్ద మొదలైంది. నిర్ణయ ధరతో పోల్చితే ఆర్‌ఐఎల్‌–ఆర్‌ఈ 40% లాభంతో రూ.212 వద్ద ముగిసింది.ఆర్‌ఈ ట్రేడింగ్‌లో ఇంట్రాడే ట్రేడింగ్‌ ఉండదు.

మరిన్ని వార్తలు