మళ్లీ రిలయన్స్, ఎస్సార్ బంకులు!

19 Aug, 2014 23:24 IST|Sakshi
మళ్లీ రిలయన్స్, ఎస్సార్ బంకులు!

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), ఎస్సార్ ఆయిల్‌లకు చెందిన పెట్రోలు బంకులు మళ్లీ తెరచుకునేందుకు మార్గం సుగమం అవుతోంది. డీజిల్ ధరలపై నియంత్రణ దీపావళికల్లా పూర్తిగా ఎత్తివేసే అవకాశాల నేపథ్యంలో అప్పటికల్లా ఈ రెండు కంపెనీలు తమ పెట్రో-రిటైల్ అమ్మకాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగొస్తుండటంతో డీజిల్‌పై ఒక్కో లీటరుకు ఆదాయ నష్టం(అండర్ రికవరీ-మార్కెట్ ధర, వాస్తవ అమ్మకం ధర మధ్య వ్యత్యాసం) ఆల్‌టైమ్ కనిష్టమైన రూ.1.33కు దిగొచ్చిన సంగతి తెలిసిందే.

గత కొద్ది నెలల నుంచీ లీటరుపై నెలకు 50 పైసలు చొప్పున డీజిల్ ధరను పెంచడం, డాలరుతో రూపాయి మారకం విలువ కొద్దిగా బలపడటం వంటివి కూడా ఆదాయ నష్టాలు తగ్గుముఖం పట్టేందుకు దోహదం చేస్తున్నాయి. ఇప్పటికే పెట్రోలుపై నియంత్రణ పూర్తిగా తొలగించిన విషయం విదితమే. ప్రస్తుతం డీజిల్‌పై లీటరుకు ఆదాయ నష్టం రూ.1.78గా లెక్కతేలుతోంది. మొత్తంమీద చూస్తే... నవంబరు నాటికి డీజిల్ డీరెగ్యులేషన్(నియంత్రణ తొలగింపు) పూర్తిస్థాయిలో అమల్లోకిరావచ్చని అంచనా వేస్తున్నారు.

 రిలయన్స్ ఆసక్తి...
 కొన్నేళ్ల క్రితమే పెట్రో-రిటైలింగ్‌లోకి అడుగుపెట్టిన రిలయన్స్... ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లు విక్రయిస్తున్నట్లు సబ్సిడీ ధరలకు డీజిల్ ఉత్పత్తులను విక్రయించలేక 2008లో బంకులను మూసేసింది. ప్రభుత్వం ఓఎంసీలకు ఆదాయ నష్టాలను పూడ్చుతుండటంతో వాటికి కొంత వెసులుబాటు లభిస్తోంది. ‘2008 నుంచి దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన సుమారు 1,100 బంకులు మూతపడిఉన్నాయి. డీజిల్ ధరల పూర్తి డీరెగ్యులేషన్ గనుక అమల్లోకివస్తే రిలయన్స్ తన బంకులను తిరిగి తెరవడం ఖాయం’ అని కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

 రెట్టింపుకానున్న ఎస్సార్ బంకులు...
 ఎస్సార్ ఆయిల్ కూడా తమ రిటైల్ అవుట్‌లెట్లలో దశలవారీగా డీజిల్ అమ్మకాలను షురూ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. డీరెగ్యులేషన్ సాకారమైతే ఇప్పుడున్న 1,400 బంకులను వచ్చే మూడేళ్లలో 3,000కు పెంచుకోవాలనేది ఈ కంపెనీ ప్రణాళిక. ఇప్పటికే 300 కొత్త బంకుల ఏర్పాటు వివిధ దశల్లో ఉన్నాయి. కాగా, షెల్ ఇండియా కూడా డీరెగ్యులేషన్ ప్రక్రియను నిశితంగా గమనిస్తోంది. ఇది అమల్లోకి రానుండటంతో తనకున్న 100 బంకుల్లో రిటైల్ అమ్మకాలను పెంచడంపై దృష్టిసారిస్తోంది.

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45,000కు పైగా పెట్రోలు బంకులు ఉండగా.. ఇందులో మూడోవంతు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌వే కావడం గమనార్హం. డీజిల్‌పై నియంత్రణలు తొలగితే.. ప్రైవేటు కంపెనీలు దూకుడు పెంచుతాయన్న ఆందోళనతో ఓఎంసీలు కూడా తమ విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తున్నాయి. రానున్న కొద్ది సంవత్సరాల్లో కొత్తగా 16,000 బంకులను ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నాయి. గతేడాది పెట్రో ఉత్పత్తులపై(డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్) ఓఎంసీల అండర్ రికవరీ రూ.1,39,869 కోట్లు కాగా, ఈ ఏడాది ఈ మొత్తం రూ.91,665 కోట్లకు పరిమితం కావచ్చని అంచనా.

మరిన్ని వార్తలు