రిలయన్స్‌ ఆన్‌లైన్‌ ఏజీఎమ్‌ రేపు..

14 Jul, 2020 01:57 IST|Sakshi

500 ప్రదేశాల నుంచి లక్ష మందికి పైగా లాగిన్‌...!

భారీ ప్రకటనలు ఉండే అవకాశం

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎమ్‌) రేపు (బుధవారం) జరగనున్నది. కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ ఏజీఎమ్‌ను నిర్వహిస్తున్నారు. కంపెనీకి  ఇదే తొలి ఆన్‌లైన్‌ ఏజీఎమ్, దాదాపు 500కు పైగా ప్రదేశాల నుంచి లక్షకు పైగా వాటాదారులు ఈ ఆన్‌లైన్‌ ఏజీఎమ్‌లో పాల్గొంటారని అంచనా. ఈ ఆన్‌లైన్‌ ఏజీఎమ్‌పై అవగాహన కల్పించడానికి ఇప్పటికే ఒక చాట్‌బోట్‌ను వాట్సాప్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. ఈ వర్చువల్‌ ఏజీఎమ్‌లో వాటాదారులు చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రసంగాన్ని వినడమే కాకుండా, ప్రశ్నలు కూడా అడగవచ్చని, ఓటింగ్‌లోకూడా పాల్గొనవచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.  

ఈ ఏజీఎమ్‌లో ఏం ఉండొచ్చు...?
రెండేళ్లలో రిలయన్స్‌ను రుణ రహిత కంపెనీగా మార్చడం లక్ష్యమని, గత ఏడాది ఏజీఎమ్‌లో ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25.24 శాతం వాటా విక్రయం ద్వారా 13 విదేశీ సంస్థల నుంచి రూ.1.18 లక్షల కోట్ల మేర నిధులు సమీకరించింది. ఈ పెట్టుబడులతో పాటు  రూ.53,124 కోట్ల రైట్స్‌ ఇష్యూతో ఈ లక్ష్యాన్ని గత నెలలోనే రిలయన్స్‌ కంపెనీ సాధించింది. బ్రోకరేజ్‌ సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయంటే...

► రిలయన్స్‌కు చెందిన ఆయిల్‌–టు–కెమికల్‌ (ఓఈసీ)విభాగంలో 20 శాతం వాటాను 1,500 కోట్ల డాలర్లకు సౌదీ ఆరామ్‌కో సంస్థకు విక్రయానికి సంబంధించి గత ఏడాది ప్రకటించిన డీల్‌పై మరింత  స్పష్టత రావచ్చు.  
► రిలయన్స్‌ రిటైల్, రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫారమ్స్‌ సంస్థల స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ వివరాలు వెల్లడి కావచ్చు. జియో ప్లాట్‌పారŠమ్స్‌ను అంతర్జాతీయ ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్‌ చేసే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి.  
► ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీల్లో వాటా కొనుగోలుకు సంబంధించిన వివరాలు వెలువడవచ్చు.  
► జియో ఫైబర్‌ సేవలు, రిలయన్స్‌ జియో 5జీ సేవలు ఎప్పుడు మొదలయ్యేదీ తదితర వివరాలు వెల్లడి కావచ్చు.  
► బోనస్, ఇంకా ఇతరత్రా వివరాలపై ప్రకటనలు ఉండొచ్చు.

మరిన్ని వార్తలు