రిలయన్స్‌ రిటైల్‌... @ 2.4 లక్షల కోట్లు!

27 Dec, 2019 01:54 IST|Sakshi

డీమార్ట్‌ కంటే డబుల్‌   షేర్ల మార్పిడి స్కీమ్‌ ఆధారంగా విలువ మదింపు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ.2.4 లక్షల కోట్లు(3,400 కోట్ల డాలర్లు) అని అంచనా. రిలయన్స్‌ రిటైల్‌ వాటాదారుల కోసం రిలయన్స్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన షేర్ల మార్పిడి స్కీమ్‌ ఆధారంగా చూస్తే, రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ.2.4 లక్షల కోట్లుగా తేలుతుంది. దేశంలో అతి పెద్ద సూపర్‌ మార్కెట్‌  చెయిన్, డిమార్ట్‌ను ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ మార్కెట్‌ విలువ(రూ.1.20 లక్షల కోట్లు)కు ఇది దాదాపు రెట్టింపు విలువ. ఇంగ్లాండ్‌లో అతి పెద్ద సూపర్‌ మార్కెట్‌ చెయిన్‌ టెస్కో విలువ (3,200 కోట్ల డాలర్లు)కంటే కూడా అధికం కావడం విశేషం. షేర్ల మార్పిడి స్కీమ్‌లో భాగంగా ప్రతి నాలుగు రిలయన్స్‌ రిటైల్‌ షేర్లకు గాను ఒక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ను పొందవచ్చని రిలయన్స్‌ రిటైల్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది.  

షేర్ల మార్పిడి స్కీమ్‌ ఎందుకంటే..,  
రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీ తన ఉద్యోగులకు 2006, 2007 సంవత్సరాల్లో స్టాక్‌ ఆప్షన్స్‌ ఇచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఈ ఆర్‌ఎస్‌యూ(రిస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్లు)ను   ఈక్విటీ షేర్లుగా మార్చుకున్నారు.  ఈక్విటీ షేర్లు పొందిన ఉద్యోగులు వీటిని నగదుగా మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారని రిలయన్స్‌ రిటైల్‌ వివరించింది. ఈ కంపెనీని ఇప్పటికిప్పుడు స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేసే ఆలోచన ఏదీ లేదని, అందుకే ఈ షేర్ల మార్పిడి స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించింది. రిలయన్స్‌ రిటైల్‌లో 99.95% వాటా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌కు ఉందని, మిగిలిన 0.05 శాతం వాటా ఉద్యోగుల వద్ద ఉందని వివరించింది.  ఈ షేర్ల మార్పిడి స్కీమ్‌కు ఆమోదం పొందడం కోసం వచ్చే నెల 23న ఈక్విటీ వాటాదారుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపింది.  

పదివేలకు పైగా రిటైల్‌ స్టోర్స్‌...
దేశవ్యాప్తంగా 10,901 స్టోర్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీ ఆదాయం ఈ ఏడాది మార్చితో ముగిసిన సంవత్సరానికి 89% వృద్ధితో రూ.1.3 లక్షల కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 169 శాతం ఎగసి రూ.5,550 కోట్లకు చేరింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు పరోక్ష అనుబంధ సంస్థగా రిలయన్స్‌ రిటైల్‌ వ్యవహరిస్తోంది. గురువారం రిలయన్స్‌ షేర్‌ రూ.1,516 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద  కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.9.6 లక్షల కోట్లు. రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీని ఐదేళ్లలోపు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేస్తామని ఈ ఏడాది ఆగస్టులోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు