అదరగొట్టిన రిలయన్స్‌

21 Jul, 2017 00:08 IST|Sakshi
అదరగొట్టిన రిలయన్స్‌

లాభం 28% పెరుగుదల... క్యూ1లో రూ. 9,108 కోట్లు...
ఆదాయం రూ. 90,537 కోట్లు; 27 శాతం వృద్ధి

పెట్రోకెమికల్స్, రిఫైనింగ్‌ విభాగాల జోరు...
స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ 11.9 డాలర్లు...
రూ. 20 వేల కోట్లు సమీకరించనున్న జియో
నేడు ఏజీఎం; ముకేశ్‌ అంబానీ ప్రసంగం


ముంబై: దేశీ కార్పొరేట్‌ అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. కంపెనీ ఈ ఏడాది తొలి త్రైమాసికం(2017–18, క్యూ1)లో రూ.9,108 కోట్ల రికార్డు స్థాయి కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.7,113 కోట్లతో పోలిస్తే 28 శాతం ఎగబాకింది. ఒక క్వార్టర్‌లో ఇంత అత్యధిక లాభం ఆర్జించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, క్యూ1 లాభంలో రూ.1,087 కోట్ల అసాధారణ రాబడి (గల్ఫ్‌ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్‌లో వాటా విక్రయం ద్వారా) కూడా కలిసి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ వన్‌టైమ్‌ రాబడిని తీసేస్తే లాభం రూ.8,021 కోట్లుగా లెక్కతేలుతుంది. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం జూన్‌ త్రైమాసికంలో రూ.90,537 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.71,451 కోట్లతో పోలిస్తే... 26.7 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా పెట్రోకెమికల్స్, రిఫైనింగ్‌ వ్యాపారాల జోరు కంపెనీ లాభాలు పుంజుకోవడానికి దోహదం చేసింది. మార్కెట్‌ విశ్లేషకులు క్యూ1లో ఆర్‌ఐఎల్‌రూ.7,960 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనావేశారు.

తొమ్మిదేళ్ల గరిష్టానికి రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎం)...
కంపెనీ స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎం) జూన్‌ క్వార్టర్‌లో 11.9 డాలర్లకు ఎగబాకింది. ఇది తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. గతేడాది ఇదే క్వార్టర్‌లో జీఆర్‌ఎం 11.5 డాలర్లు. దీంతో పోలిస్తే 3.5 శాతం పెరిగింది. కాగా, క్యూ1లో రిలయన్స్‌ జీఆర్‌ఎం 11 డాలర్లుగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఒక్కో బ్యారెల్‌ ముడిచమురును శుద్ధి చేసి పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు.

రంగాల వారీగా చూస్తే...
పెట్రోకెమికల్స్‌: ఈ కీలక విభాగం ఆదాయం క్యూ1లో రూ.25,461 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.20,718 కోట్లతో పోలిస్తే... 23% ఎగబాకింది. స్థూల లాభం(పన్నులు, వడ్డీ చెల్లింపులకు ముందు–ఎబిటా) 44% భారీ వృద్ధితో రూ.2,806 కోట్ల నుంచి రూ.4,031 కోట్లకు దూసుకెళ్లింది. ఎబిటా మార్జిన్‌ 15.8%తో ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయిని నమోదు చేసింది.
రిఫైనింగ్‌: మరో కీలక వ్యాపారమైన ఈ విభాగంలో ఆదాయం రూ. 56,568 కోట్ల నుంచి రూ.66,945 కోట్లకు పెరిగింది. 18.3 శాతం వృద్ధి చెందింది. స్థూల లాభం రూ.6,593 కోట్ల నుంచి రూ.7,476 కోట్లకు ఎగసింది. 13.3 శాతం వృద్ధి నమోదైంది.

చమురు–గ్యాస్‌: ఈ విభాగంలో ఆదాయం 1.2 శాతం తగ్గుదలతో రూ.1,340 కోట్ల నుంచి రూ.1,324 కోట్లకు చేరింది. స్థూల నష్టం రూ.373 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది క్యూ1లో స్థూల నష్టం రూ.312 కోట్లతో పోలిస్తే 20 శాతం మేర ఎగబాకినట్లు లెక్క. ప్రధానంగా కేజీ–డీ6 క్షేత్రాల్లో చమురు, గ్యాస్‌ ఉత్పత్తి భారీగా పడిపోతూ వస్తుండటం నష్టాలు పెరిగిపోయేందుకు కారణమవుతోంది.

రిటైల్‌: ఈ విభాగంలో ఆదాయం భారీ స్థాయిలో 73.5% దూసుకెళ్లింది. క్రితం ఏడాది క్యూ1లో రూ.6,666 కోట్ల నుంచి ఈ ఏడాది క్యూ1లో రూ.11,571 కోట్లకు చేరింది. స్థూల లాభం రూ.148 కోట్ల నుంచి రూ.292 కోట్లకు ఎగబాకింది. 97.3% వృద్ధి నమోదైంది.

టెలికం: గతేడాది సెప్టెంబర్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన రిలయన్స్‌ జియో టెలికం విభాగం ఆదాయం, స్థూల లాభాలను కంపెనీ ప్రత్యేకంగా వెల్లడించలేదు. అయితే, ప్రారంభించిన 170 రోజుల్లోనే 10 కోట్లకుపైగా యూజర్లను దక్కించుకుని ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ కంపెనీగా జియో నిలిచిందని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జియో యూజర్లకు బిల్లింగ్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, నేడు(శుక్రవారం) జరగనున్న కంపెనీ ఏజీఎంలో జియోకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇతర ముఖ్యాంశాలివీ...
జూన్‌ క్వార్టర్‌లో కంపెనీ రూ.25,192 కోట్ల మొత్తాన్ని పెట్టుబడుల రూపంలో ఖర్చు చేసింది.
ఇతర ఆదాయం రూ. 2,124 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ1లో ఈ మొత్తం రూ. రూ.2,378గా ఉంది.
కంపెనీ మొత్తం రుణ భారం జూన్‌ చివరి నాటికి రూ.2,00,674 కోట్లకు ఎగబాకింది. మార్చి చివరికి ఇది రూ.1,96,601 కోట్లు.
ఇక నగదు నిల్వలు జూన్‌ ఆఖరినాటికి రూ.72,107 కోట్లకు తగ్గాయి. మార్చి చివరికి ఈ మొత్తం రూ.77,226 కోట్లు.
ఇజ్రాయెల్‌కు చెందిన జెరూసలెం ఇన్నోవేషన్‌ ఇంకుబేటర్‌(జీఐఐ) అనే సంస్థలో 2.5 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు రిలయన్స్‌ ప్రకటించింది. ఈ మొత్తానికిగాను జేఐఐలో 20% వాటా దక్కుతుందని తెలిపింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), ఫిన్‌టెక్, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) సంబంధిత ప్రారంభస్థాయి స్టార్టప్‌లలో జేఐఐ  పెట్టుబడులు పెడుతుంది.
గురువారం బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్‌ షేరు స్వల్పంగా 0.3 శాతం నష్టంతో రూ.1,529 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను ప్రకటించింది.

బాలాజీ టెలి ఫిల్మ్స్‌లో 25 శాతం వాటా కొనుగోలు...
మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ బాలాజీ టెలిఫిల్మ్స్‌లో 24.92 శాతం వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దక్కించుకోనుంది. ఈ ప్రతిపాదనకు గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. ఇందుకోసం రిలయన్స్‌ దాదాపు రూ.413 కోట్లను చెల్లించనుంది. కాగా, రిలయన్స్‌కు ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు ద్వారా (షేరు రూ.164 చొప్పున) 2.52 కోట్ల షేర్లను కేటాయించేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని బాలాజీ టెలిఫిల్మ్స్‌ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది.

ఈ లావాదేవీ ద్వారా లభించనున్న మొత్తాన్ని కంటెంట్‌ డెవలప్‌మెంట్‌కు ఉపయోగించనున్నట్లు పేర్కొంది. తమ కంపెనీలో రిలయన్స్‌ భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందని బాలాజీ టెలిఫిల్మ్స్‌ చైర్మన్‌ జితేంద్ర కపూర్‌ వ్యాఖ్యానించారు. గురువారం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర 1.74 శాతం నష్టంతో రూ. 187 వద్ద ముగిసింది. అయితే, గతనెల 28న రూ.130గా ఉన్న షేరు ధర 16 ట్రేడింగ్‌ సెషన్లలో (ఈ నెల 20న) రూ.190కి చేరుకోవటం గమనార్హం. అంటే కేవలం 20 రోజుల్లో ఈ షేరు ధర ఏకంగా 40 శాతం పెరిగిందన్న మాట.

రిలయన్స్‌ జూన్‌ క్వార్టర్‌లో మరోసారి అత్యంత పటిష్టమైన పనితీరును నమోదుచేసింది. లాభాల జోరుకు మా కీలక వ్యాపారాలైన పెట్రోకెమికల్స్, రిఫైనింగ్‌ విభాగాల్లో భారీ మార్జిన్లు దోహదం చేశాయి. ఇక రిటైల్‌ వ్యాపారం 74% ఆదాయ వృద్ధిని సాధించి దూసుకెళ్తోంది. భారత టెలికం రంగంలో సరికొత్త విప్లవానికి మా రిలయన్స్‌ జియో నాంది పలికింది. దేశంలో డేటా వినియోగం, టెలికం సేవల స్వరూపంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. – ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ

జియో రూ. 20 వేల కోట్ల సమీకరణ...
రైట్స్‌ ఇష్యూ రూపంలో రూ.20 వేల కోట్ల నిధులను సమీకరించనున్నట్లు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తెలిపింది. ఒక్కొక్కటి రూ.50 విలువగల 400 కోట్ల ఆప్షనల్లీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను(ఓసీపీఎస్‌) ఆర్‌ఐఎల్‌ వాటాదారులకు జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరిస్తామని ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ఈ నిధులను సేవల విస్తరణకు వినియోగించనుంది. ఇప్పటికే రిలయన్స్‌ జియోపై ఆర్‌ఐఎల్‌ దాదాపు రూ.1.9 లక్షల కోట్ల నిధులను వెచ్చించిన సంగతి తెలిసిందే. తాజా నిధులతో ఈ మొత్తం రూ.2.1 లక్షల కోట్లకు చేరనుంది.

మరిన్ని వార్తలు