జియోపై భారీగా ఖర్చు

18 Jan, 2018 16:29 IST|Sakshi

ముంబై : టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించుకోబోతుందట. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో రిలయన్స్‌ జియోపై భారీగా మరో 23 బిలియన్‌ డాలర్లను(రూ.1,46,841 కోట్లు) వెచ్చించనున్నట్టు మూడీస్‌ అంచనావేస్తోంది. వైర్‌లెస్‌ సర్వీసులకు మించి తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటుందని తెలిపింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ఇప్పటికే 31 బిలియన్‌ డాలర్లను(రూ.1,97,916 కోట్లు) వెచ్చించింది. 21016లో మార్కెట్‌లోకి ప్రవేశించాక.. ఇతర టెల్కోలకు షాకిస్తూ పలు సంచలనాలనే సృష్టించింది. ప్రస్తుతం మార్కెట్‌లో దేశీయ నాలుగో టెలికాం ఆపరేటర్‌గా ఉంది. అయితే మూడీస్‌ అంచనాలపై కంపెనీ వెంటనే స్పందించలేదు. రేపు(శుక్రవారం) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేయబోతుంది. 

వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో పెట్టే మూలధన వ్యయాలు, ఫైబర్‌-టూ-హోమ్‌, డిజిటల్‌ టీవీ, మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను మెరుగుపరిచే బిజినెస్‌లపై వెచ్చించనుందని సింగపూర్‌కు చెందిన మూడీస్‌ విశ్లేషకుడు వికాస్‌ హలాన్‌ చెప్పారు. మరికొంత నగదును నాలుగో తరానికి చెందిన ఫీచర్‌ ఫోన్లపై, సంబంధిత నెట్‌వర్క్‌ ఖర్చులపై పెట్టనుందని పేర్కొన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు షాకిస్తూ.. జియో ప్రతి నెలా కొత్త సబ్‌స్క్రైబర్లను విపరీతంగా యాడ్‌ చేసుకుంటోంది. 2016లో టెలికాం మార్కెట్‌లోకి  ప్రవేశించిన బిలీనియర్‌ ముఖేష్‌ అంబానీ, అన్ని కాల్‌ సర్వీసులు జీవిత కాలం ఉచితమంటూ తీవ్ర ధరల యుద్ధానికి తెరతీశారు. డేటా సర్వీసులను కూడా కొన్ని నెలల పాటు ఉచితంగా అందించారు. అంతేకాక గతేడాది జూలైలో తీసుకొచ్చిన ఫీచర్‌ ఫోన్‌తో మరోసారి టెల్కోలకు హడలెత్తించారు.  


 

మరిన్ని వార్తలు