రిలయన్స్‌ షేరు ర్యాలీ ఇప్పట్లో ఆగదు

20 Jun, 2020 13:04 IST|Sakshi

మరికొంత కాలం ర్యాలీకి ఆస్కారం 

3ఏళ్లలో మరోసారి షేరు ధర రెట్టింపు అయ్యే అవకాశం

రిలయన్స్‌ షేరు అవుట్‌లుక్‌పై విశ్లేషకుల అంచనా

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ర్యాలీ మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 వ్యాప్తితో గత ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసిన సందర్భంలో... రిలయన్స్‌ షేరు ధర కేవలం 3నెలల్లో రెట్టింపు అయ్యింది. ఈ మార్చి 23న రూ.868 వద్ద ఉన్న షేరు జూన్‌ 20నాటికి రూ.1761కి చేరుకుంది. ఇంతటి స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., పలు బ్రోకరేజ్‌ సంస్థలు షేరుపై ‘‘బుల్లిష్‌’’  వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుకు మొత్తం 17 బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘స్ట్రాం‍గ్‌ బై’’ రేటింగ్‌ను, 8 కంపెనీలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. మరోవైపు 3 బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘సెల్‌’’ రేటింగ్‌ను ఇవ్వగా, 1 బ్రోకరేజ్‌ సంస్థ ‘‘స్ట్రాంగ్‌ సెల్‌’’ రేటింగ్‌ను ఇచ్చింది.  

మరో 3ఏళ్లలో షేరు ధర రెట్టింపు: ప్రభుదాస్‌ లిల్లాధర్‌ బ్రోకరేజ్‌
షేర్‌ హోల్డర్ల కోణంలో పరిశీలిస్తే వచ్చే 3ఏళ్లలో షేరు మరోసారి రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ప్రభుదాస్‌ లిల్లాధర్‌ బ్రోకరేజ్‌ సంస్థ రీసెర్చ్‌ విశ్లేషకుడు అజయ్‌ బోడ్కే తెలిపారు. భారత క్యాపిటల్‌ మార్కెట్లో అతి తక్కువ కాల వ్యవధిలో రూ.1లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అనేది అరుదుగా జరిగే సంఘటనగా ఆయన అభివర్ణించారు. ‘‘భారత్‌ జనాభాలో ఆరోవంతు అవసరాల్లో జియో భాగం కానుంది. రిటైల్, టెలికాం, కన్జ్యూమర్‌ కేంద్రీకృత వ్యాపారాల వృద్ధి రిలయన్స్‌ షేరు ర్యాలీకి సహకరిస్తాయి. ఈ షేరు మార్చి కనిష్టస్థాయి నుంచి డ్రీమ్‌ ర్యాలీ చేసింది. షేర్‌ హోల్డర్ల కోణంలో పరిశీలిస్తే వచ్చే 3ఏళ్లలో షేరు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.’’ అని అజయ్‌ బోడ్కే తెలిపారు.  

వచ్చే 2-5ఏళ్లలో జియో వాల్యూయేషన్‌ 200 బిలియన్‌ డాలర్లు: కేఆర్‌ చౌక్సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 
వచ్చే 2-5ఏళ్లలో జియో ప్లాట్‌ఫాం 200 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్స్‌ను సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కేఆర్‌ చౌక్సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మేనేజర్‌ దేవన్‌ చౌక్సీ అన్నారు. జియో ప్లాట్‌ఫామ్‌ సామర్థ్యాన్ని గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ లాంటి వాటితో పోలిస్తున్నారు. కంపెనీని రుణ రహితంగా మారుస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని ముకేశ్‌ నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. రిటైల్, హెల్త్‌కేర్, పేమెంట్స్ గేమింగ్ అండ్ ఎడ్యుకేషన్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి అనేక పెద్ద మొత్తంలో వ్యాపార అవకాశాల కోసం రిలయన్స్‌ పూర్తి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని చౌక్సీ చెప్పారు.

ఆశావాదం విస్తృతంగా వ్యాపించింది: ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌
కంపెనీపై ఆశావాదం విస్తృత స్థాయిలో వ్యాపించడంతో షేరు మరి కొంతకాలం ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌ అయాన్ ముఖోపాధ్యాయ్ అన్నారు. ఇంకా చాలా ఫండింగ్‌ సంస్థలు ఈ షేరును కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఇటీవల స్టాక్‌ విభజన జరగవచ్చనే ఊహాగానాలు కూడా వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. రిలయన్స్‌ వ్యాపారాల విభజన జరిగి వేర్వేరు సంస్థలుగా ఎక్చ్సేంజీల్లో లిస్ట్‌ కావచ్చన్నారు. దీంతో మరిన్ని పెట్టుబడులను రిలయన్స్‌ను ఆకర్షించేందుకు అవకాశం ఉందిని ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. 

  • నిర్ణయించిన గడువుకు ముందే ‍కంపెనీని నికర రుణరహితంగా మారుస్తామని ఇచ్చిన హామిని ముకేశ్‌ అంబానీ నిలబెట్టుకోవడంతో ఇన్వెస్టర్లు రిలయన్స్‌ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది మార్చి 31వ తేదిలోగా కంపెనీని రుణ రహిత కంపెనీగా మారుస్తామని గతంలో కంపెనీ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. 
  • రిలయన్స్‌ అనుబంధ సంస్థ జియో ఫ్లాట్‌ఫామ్‌ పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పాటు దేశంలో అతిపెద్ద రైట్స్‌ ఇష్యూను విజయవంతం చేయడంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ తొలిసారి 150బిలియన్‌ డాలర్లను అందుకుంది. ఈ క్రమంలో 150బిలియన్‌ డాలర్లను అందుకున్న తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ చరిత్ర సృష్టించింది. 
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కేవలం 58 రోజుల్లో రూ.1,68,818 కోట్లను సమీకరించింది. ఇందులో జియోలో వాటా విక్రయంతో రూ.115,693.95 కోట్లను, రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53,124.20 కోట్లును సేకరించింది. గతంలో పెట్రో-రిటైల్‌ జాయింట్‌ వెంచర్‌లో బ్రిటన్‌ సంస్థ బీవీకి వాటాను విక్రయించడంతో రూ.7వేల కోట్లకు విక్రయించడంతో మొత్తం రూ.1.75లక్షల కోట్లు నిధుల సమీకరణ చేయగలిగింది. 
     
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా