ఫార్చూన్‌ ఇండియా 500లో ఆర్‌ఐఎల్‌ టాప్‌

24 Jul, 2019 08:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫార్చూన్‌ 500 జాబితాలో భారత్‌ నుంచి అత్యంత విలువైన కంపెనీగా (ఆదాయం పరంగా) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇన్నాళ్లు భారత్‌లోని టాప్‌ కంపెనీగా కొనసాగుతూ వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)ని వెనక్కినెట్టింది. తాజా ఫార్చూన్‌ గ్లోబల్‌ 500లో భారతదేశ సంపన్న పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్‌ 106వ స్థానానికి ఎగబాకింది. ఆ తరువాత స్థానంలో ఉన్న దేశీయ కంపెనీ ఐఓసీ 117వ స్థానంలో నిలిచింది. 2018లో 62.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఆర్‌ఐఎల్‌ ఆదాయం 2019లో 32.1 శాతం వృద్ధి చెంది 82.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఐఓసీ ఆదాయం 17.7 శాతం వృద్ధి చెంది 77.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడైంది. గడిచిన పదేళ్లలో ఆర్‌ఐఎల్‌ ఆదాయం 7.2 శాతం చొప్పున చక్రగతి వృద్ధి రేటును నమోదుచేయగా.. ఐఓసీ ఆదాయం 3.64 శాతం వృద్ధితో కొనసాగుతోంది. ఇక ఫార్చూన్‌ 500లో స్థానం సంపాదించిన ఇతర భారత కంపెనీల జాబితాలో.. ఓఎస్‌జీసీ(160), ఎస్‌బీఐ(236), టాటా మోటార్స్‌(265), బీపీసీఎల్‌(275), రాజేష్‌ ఎక్స్‌పోర్ట్‌ (495) స్థానాల్లో నిలిచాయి. జాబితాలోని మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌ ఉంది.  

మరిన్ని వార్తలు