నాలుగు నెలల గరిష్టానికి రిటైల్‌ ధరలు

13 Jun, 2018 00:07 IST|Sakshi

మే నెలలో 4.87 శాతం

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం 2018 మే నెలలో 4.87 శాతానికి పెరిగింది. రిటైల్‌ వస్తువుల బాస్కెట్‌ మొత్తం ధర 2017 ఏడాది మే నెలతో పోల్చితే 2018 మే నెలలో 4.87 శాతం పెరిగిందన్నమాట. ఇంత స్థాయిలో రిటైల్‌ ధరల పెరుగుదల రేటు నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.58 శాతంగా నమోదయితే, గత ఏడాది మే నెలలో 2.18 శాతంగా ఉంది. కాగా ద్రవ్యోల్బణం రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) నిర్దేశిత 4 శాతం (ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో)వద్ద ఉండటం గమనార్హం. ఐదు ముఖ్య విభాగాలను చూస్తే...

ఆహారం, పానీయాల విభాగంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు 3.37 శాతంగా ఉంది.  
 పాన్, పొగాకు వంటి విభాగాల్లో ధరల పెరుగుదల రేటు 8 శాతం.
 దుస్తులు, పాదరక్షల విషయంలో ద్రవ్యోల్బణం రేటు 5.47 శాతం.  
 హౌసింగ్‌కు సంబంధించి రేటు 8.40 శాతం
 ఇంధనం, లైట్‌ విభాగంలో ధరల పెరుగుదల రేటు 5.80 శాతం.  

ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల ఇలా...
వినియోగ ఆహార ధరల పెరుగుదల రేటు ఏప్రిల్‌లో 2.80 శాతం ఉంటే, మే నెలలో ఈ రేటు 3.10 శాతానికి ఎగసింది. పండ్ల ధరలు భారీగా 12.33 శాతం పెరిగాయి.  కూరగాయల ధరలు 8.04 శాతం పెరిగాయి. గుడ్లు ధర 5.78 శాతం పెరిగింది.

ఐదు శాతంలోపు ధరలు పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో ప్రిపేర్డ్‌ మీల్స్, స్నాక్స్, స్వీట్స్‌ (4.98 శాతం), మాంసం చేపలు (3.53 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (3.20 శాతం) ఉన్నాయి. ఇక పప్పు ధాన్యాల విషయంలో ధరలు అసలు పెరగలేదు. – 11.57 శాతం తగ్గాయి. ఇక చక్కెర సంబంధిత ఉత్పత్తుల ధరలు కూడా 8.12 శాతం తగ్గాయి.  

మరిన్ని వార్తలు