పెట్టుబడికి... ప్లాటినం రక్ష!

20 Jul, 2015 02:12 IST|Sakshi
పెట్టుబడికి... ప్లాటినం రక్ష!

♦ ప్లాటినం ఆభరణాలకు పెరుగుతున్న డిమాండ్
♦ ఉత్పత్తితో పోలిస్తే డిమాండ్ పెరుగుదలే అధికం

 పెట్టుబడి పెట్టాలంటే ఎంతసేపూ డిపాజిట్లు, షేర్లు, రియల్ ఎస్టేటూ, బంగారం, వెండి... ఇంతేనా!! ఇంకేమీ లేవా? లేకేం... బంగారంకన్నా ఖరీదైన తెల్ల బంగారం ప్లాటినం ఉంది. కాకపోతే దీని డిమాండ్ ఎక్కువగానే ఉన్నా సరఫరా మాత్రం తక్కువ.అందుకే ధర కూడా ఎక్కువ. సరఫరా అంతగా ఉండదు కాబట్టి దీన్నెవరూ పెద్దగా సూచించరు. కాకపోతే ఈ మధ్య ప్లాటినం ఆభరణాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే మాత్రం స్వల్పకాలంలో లాభాలు ఆర్జించాలనుకునేవారికి ఇది బాగానే అక్కరకొస్తోంది. అందుకే ఈ వారం ప్లాటినం కబుర్లివి...
 
 ప్లాటినంతో ట్రేడింగ్ చేయొచ్చు...
 ప్లాటినం డిమాండ్ ఈ మధ్య బాగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లూ దృష్టి పెడుతున్నారు. అందుకే నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్  2012లో ఈ-ప్లాటినం ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీని ప్రాధాన్యం కూడా బాగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫ్యూచర్ మార్కెట్‌లో కూడా ప్లాటినం ట్రేడింగ్‌ను ఆరంభించారు. ఇన్వెస్టర్లు ప్లాటినాన్ని యూనిట్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. ఈ-యూనిట్లను విక్రయించవచ్చు. కావాలనిపిస్తే ఎలక్ట్రానిక్ యూనిట్ల రూపంలో ఉంచేసుకోవచ్చు కూడా. లేదంటే భౌతికంగా డెలివరీ కూడా తీసుకోవచ్చు.

ప్లాటినం భౌతిక డెలివరీ కేంద్రాలు ముంబై, ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లలో ఉన్నాయి. ఈ భౌతిక డెలివరీ విషయానికొస్తే ప్రస్తుతం ప్లాటినం నాణేలు, కడ్డీల రూపంలో లభ్యమవుతోంది. ఇవి జాతీయ బ్యాంకులతో పాటు అథరైజ్డ్ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. 1 గ్రాము నుంచి 100 గ్రాముల వరకు వివిధ యూనిట్లలో ప్లాటినంను డెలివరీ చేస్తున్నారు. వీటి నాణ్యత 99.95 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం గ్రాము ప్లాటినం ధర రూ.2,730కి కాస్త అటూ ఇటుగా ఉంది. దేశంలో భౌతికంగా ప్లాటినం కొనుగోలు చేయటమనేది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అంటే డెలివరీలు స్వల్పంగానే నమోదవుతున్నాయి. ప్లాటినాన్ని భౌతికంగా కొనుగోలు చేసేవారు కచ్చితంగా వెండర్స్ వద్ద అధికారిక సర్టిఫికెట్‌ను సరిచూసుకోవాలి.
 
దీంతో ధర పెరుగుతుందంటున్న నిపుణులు
ఈ-ట్రేడింగ్‌లోనూ నానాటికీ వృద్ధి

 
 డిమాండ్‌కు తగ్గట్టు లేని ఉత్పత్తి
 ప్లాటినం ధరలు మున్ముందు బాగా పెరిగే అవకాశం ఉందని మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, డెవలప్‌మెంట్ నివేదిక చెబుతోంది. ఎందుకంటే దేశంలో 2017 నాటికి ప్లాటినం డిమాండ్ 80 టన్నులకు పెరిగే అవకాశముంది. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా తదితరాల వల్ల ఇక్కడ డిమాండ్ వేగంగా పెరుగుతుందని ఈ సంస్థ పేర్కొంది. యువత, మగవారు ఎక్కువగా ప్లాటినం ఆభరణాల వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకే ప్లాటినంను భావితరాల బంగారంగా చెబుతున్నారు. 35-40 ఏళ్ల వయసున్న మహిళలు ప్లాటినాన్ని ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వ సూచికగా గుర్తిస్తున్నారని ప్లాటినం గిల్డ్ ఇండియా చెబుతోంది. ఇది గతేడాది డిసెంబర్‌లో ఎవేరా బ్రాండ్‌తో ప్లాటినం వెడ్డింగ్ కలె క్షన్స్‌ను ప్రారంభించింది. ఇవి ప్లాటినం డిమాండ్‌ను అనూహ్యంగా పెంచాయి.

 డిమాండ్ ఇంతలా పెరుగుతున్నా ప్లాటినం ఉత్పత్తి మాత్రం అలా లేదు. 2013-14లో ప్లాటినం ఉత్పత్తి అంతర్జాతీయంగా 1.7 లక్షల కిలోలుగా ఉండగా... అది గతేడాది 1.5 ల క్షల కిలోలకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ప్లాటినంలో దక్షిణాఫ్రికా వాటా 75% వరకు ఉండగా తర్వాతి స్థానాల్లో రష్యా, జింబాబ్వే ఉన్నాయి. ప్లాటినం వినియోగంలో చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా తర్వాతి స్థానాల్లో జపాన్, యూరప్ ఉన్నాయి. డిమాండ్-సరఫరా మధ్య తేడా ఎక్కువగా ఉంది కనక ఇది ధర పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఓ సంస్థ అంచనా ప్రకారం ప్లాటినం జ్యుయల్లరీ మార్కెట్ విలువ భారత్‌లో రూ.1,900 కోట్లుగా ఉంది. వార్షిక వృద్ధి 45%.
 
 ఇవీ... ప్లాటినం విశేషాలు
►చూడ్డానికి వెండిలా తెల్లగా ఉండే ప్లాటినాన్ని 1735లో గుర్తించారు. అరుదైన లోహం. దృఢమైనది. తీగలా సాగుతుంది కనక ఆభరణాల తయారీలో ఉత్తమమైంది. తుప్పు పట్టదు. దీని వల్ల ఎలాంటి చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్స్ రావు.
►ప్లాటినం వినియోగంలో అగ్రస్థానం ఆటోమొబైల్‌ది. నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలను త గ్గించడానికి ఆటోమొబైల్ క్యాటలిటిక్ కన్వర్టర్స్‌లో ప్లాటినాన్ని ఎక్కువగా వాడతారు.  ఆ తరవాత కెమికల్ రంగంలో ఆక్టేన్ పెట్రోలియం ఉత్పత్తుల శుద్ధి కోసం కూడా దీన్ని వాడతారు.
►ప్లాటినం జ్యుయలరీకి డిమాండ్ పెరుగుతోంది. గడచిన 30 ఏళ్లలో ఈ డిమాండ్ ఏకంగా ఐదు రెట్లు పెరిగింది.
►ఎలక్ట్రానిక్స్- కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లకు ప్లాటినంతో పూత వేస్తారు. కంప్యూటర్లకు డిమాండ్ తగ్గడంతో ఇక్కడ ప్లాటినం డిమాండ్  క్షీణించింది. 2000లో 3 లక్షల ఔన్స్‌గా ఉన్న డిమాండ్ 2014 నాటికి 2 లక్షల ఔన్స్‌కు తగ్గింది.
►ఇంకా ఆక్సిజన్ సెన్సర్లు, స్పార్క్ ప్లగ్‌లు, టర్బైన్ ఇంజన్స్, డెంటల్ అనువర్తనాలు, ఎలక్ట్రోడ్స్ తదితర వాటి తయారీలో ప్లాటినాన్ని వాడతారు.

మరిన్ని వార్తలు