తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయ్!

26 May, 2014 01:18 IST|Sakshi
తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయ్!

 న్యూఢిల్లీ: రోజుకో రికార్డు సృష్టిస్తూ సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. మే నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌లు గురువారం(29న) ముగియనున్న నేపథ్యంలో ప్రధాన ఇండెక్స్‌లు ఒడిదుడుకులను చవిచూడవచ్చునని అంచనా వేశారు. ఎఫ్‌అండ్‌వో విభాగంలో ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకుంటారని చెప్పారు. కాగా, నేడు(26న) దేశ 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

 మోడీ అధ్యక్షతన ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంపై ఇటీవల మార్కెట్లు దృష్టిపెట్టాయని నిపుణులు పేర్కొన్నారు. ఇకపై ఎన్‌డీఏ ప్రభుత్వ పాలసీ ప్రకటనలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ చెప్పారు. ఇప్పటికే గరిష్ట స్థాయిలో కొత్త రికార్డులను నెలకొల్పిన మార్కెట్లు తదుపరి దశలో ప్రభుత్వ విధానాల ఆధారంగా కదిలే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు.

 మార్కెట్ల జోరు
 గడిచిన శుక్రవారం (23న) మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు ఎగసి 24,693 వద్ద నిలవగా, నిఫ్టీ కూడా 91 పాయింట్లు పుంజుకుని 7,367 వద్ద స్థిరపడింది. ఇవి చరిత్రాత్మక గరిష్ట స్థాయి ముగింపులుకాగా, ఇన్వెస్టర్లు క్యూ4 ఫలితాలను ప్రకటించనున్న మరికొన్ని బ్లూచిప్స్‌పై దృష్టిపెడతారని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ వారం ఆటో దిగ్గజం టాటా మోటార్స్, ఔషధ దిగ్గజం సన్ ఫార్మా, ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా క్యూ4తోపాటు, 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇవికాకుండా దేశీ స్టాక్ మార్కెట్ల జోరుకు కారణమవుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయగలవని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు విదేశీ సంకేతాలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని తెలిపారు.

 వృద్ధికి ఊతమిచ్చే చర్యలు
 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏకు స్పష్టమైన మెజారిటీ లభించినప్పటినుంచీ మార్కెట్లు నరేంద్ర మోడీ ప్రధానిగా ఏర్పడనున్న మంత్రివర్గంపై అంచనాలు మొదలుపెట్టాయని నిపుణులు చెప్పారు. ఎవరెవరికి  కీలక శాఖలు దక్కనున్నాయన్న అంశంపై విభిన్న అంచనాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రధానంగా ఆర్థిక, వాణిజ్య, విదేశీ శాఖలకు సంబంధించిన మంత్రి పదవులపై మార్కెట్లలో ఆశావహ అంచనాలున్నట్లు వివరించారు.

దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన వృద్ధి బాటలో పెట్టగల చర్యలను ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. కొత్త ప్రభుత్వం బిజినెస్‌కు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తుందని, ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు అనువైన విధానాలను అవలంబిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇవికాకుండా జూన్ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్షను చేపట్టనుండటంతో మంత్రివర్గ ఏర్పాటు తరువాత మార్కెట్లు వడ్డీ రేట్ల నిర్ణయాల కోసం ఎదురుచూస్తాయని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు