ఆస్తికీ బీమా ధీమా కావాలి..!

2 Nov, 2014 01:06 IST|Sakshi
ఆస్తికీ బీమా ధీమా కావాలి..!

తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎంత తీవ్రమైనవి అయినప్పటికీ భారీ ప్రాణ హాని లేకుండా నేడు రక్షణ పొందగలుగుతున్నాం. సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇందుకు ఎంతగానో దోహదపడుతోంది. ఇటీవలి హుద్‌హుద్ ఇందుకు ఉదాహరణ. అయితే భారీ ఆస్తి నష్టాన్ని మాత్రం నివారించలేకపోయాం. చాలా తక్కువ మంది మాత్రమే తమ ఆస్తులకూ బీమా ద్వారా రక్షణ పొందారు. విపత్తు సమయాల్లో ఆస్తి నష్టం పరిహారాలకు సంబంధించి బీమా రంగం విస్తృత స్థాయిలో పథకాలను అందిస్తోంది.  ఈ అంశంపై అవగాహన పెంపొందించుకోవడం అవసరం.
 
మోటార్ ఇన్సూరెన్స్...
మోటార్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి రెండు అంశాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి హైడ్రోస్టాటిక్ కవర్. మరొకటి రోడ్ సైడ్ అసిస్టెన్స్. హైడ్రోస్టాటిక్ కవర్‌ను తీసుకుంటే- వర్షపు నీటి గుంతల్లో కారు చిక్కుకుపోయి... దానిని అక్కడ నుంచి గేర్లు మారుస్తూ, బలవంతంగా బయటకు తీసే క్రమంలో ‘ఇంజిన్ ఫోర్స్’ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది.  ఇదే ‘హైడ్రోస్టాటిక్ నష్టం’.  

ఈ తరహా నష్టాన్ని మోటార్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్స్ భాషలో ‘కాన్సిక్వెంటల్’ నష్టంగా పేర్కొంటారు. మామూలుగా తీసుకునే  రెగ్యులర్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ తరహా నష్టం కవరవ్వదు. ఒక నిర్దిష్ట చర్య వల్ల సంభవించిన నష్టం కావడమే దీనికి కారణం. అనుకోని సంఘటన వల్ల ఈ నష్టం జరగదు. ఈ నష్ట నివారణకు భారీ వ్యయం తప్పదు.  మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు, ఈ మొత్తానికి అదనంగా ‘ముందు జాగ్రత్తగా’ కొంత చెల్లిస్తే కాన్సిక్వెంటల్ నష్టానికి కొండంత అండనిస్తుంది. ఇదే విధంగా పలు కంపెనీలు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవరేజ్ పాలసీలనూ అందిస్తున్నాయి.
 
గృహాలకు బీమా...
పలు కంపెనీలు ప్రస్తుతం గృహాల నష్ట పరిహారాలకు సంబంధించి బీమా పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. గృహాలకే కాకుండా ఆయా భవనాల్లోని వస్తువులకు సైతం బీమా పథకాలు ఉన్నాయి. అగ్నిప్రమాదాలుసహా ఎటువంటి ప్రకృతి వైపరీత్యానికైనా బీమా సదుపాయం లభిస్తోంది. ప్రయాణాల సమయంలో ఆభరణాలు పోవడం, విపత్తు సమయాల్లో టీవీ, ఏసీ,రిఫ్రిజిరేటర్ వంటి గృహోపకరణాల నష్ట పరిహారాలు, కుటుంబం మొత్తానికి వర్తించే ప్రమాద బీమా, నివాస గృహానికి నష్టం వాటిల్లినట్లయితే, ప్రత్యామ్నాయంగా అద్దెకు ఉండే నివాసానికి సంబంధించి చేసే వ్యయాలు, ముఖ్య డాక్యుమెంట్లు ఏవైనా పోతే తిరిగి వాటికి సంబంధించి ‘డూప్లికేట్’ పత్రాలు పొందేందుకు చేసే వ్యయాలు, ట్రాన్స్‌పోర్టింగ్ సమయాల్లో జరిగే ప్రమాద నష్టాలు... ఇలా ప్రతి అంశానికీ నేడు బీమా పథకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇళ్లకే కాదు షాపులు, కార్యాలయాలు, హోటెల్స్, పరిశ్రమలన్నింటికీ బీమా ధీమా పొందవచ్చు.  వీటన్నింటిపై అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు