రిస్క్ కు వెరవడమే మందగమనానికి కారణం

9 Jan, 2020 03:10 IST|Sakshi

ఇది మారనంత వరకు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

హెచ్‌డీఎఫ్‌సీ సీఈవో కేకిమిస్త్రి

ముంబై: పాలనా ప్రమాణాలు పెంచుకోవాలంటూ పెరిగిన రాజకీయ, నియంత్రణపరమైన ఒత్తిళ్ల మధ్య కంపెనీల బోర్డులు పనిచేస్తున్నాయని, ఫలితంగా కంపెనీలు రిస్క్ కు దూరంగా ఉండడమే ప్రస్తుత ఆర్థిక మందగమనానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సీఈవో కేకి మిస్త్రి వ్యాఖ్యానించారు. రిస్క్‌కు వెరిసే లక్షణం కారణంగా బ్యాంకర్లు రుణాలపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని, ఇది మారకపోతే భారతదేశ సహజ ఉత్సాహాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. దేశ జీడీపీ వృద్ధి 2019–20 ఆరి్థక సంవత్సరానికి 5 శాతం లోపునకు (ఇది 11 ఏళ్ల కనిష్టం) పరిమితం కావచ్చంటూ కేంద్ర గణాంక విభాగం అంచనాలు వెలువడిన సమయంలో కేకిమిస్త్రి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేవే. ముంబైలో బుధవారం సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న ఆర్థిక వృద్ధి క్షీణతకు కారణాల్లో.. బ్యాంకులకు రిస్క్‌ పెద్ద తలనొప్పిగా మారడం కూడా ఒకటి. బ్యాంకులు ఈ విషయంలో పునరాలోచనలో పడ్డాయి. వ్యవస్థలో ఎంతగానో నిధుల లభ్యత (లిక్విడిటీ) ఉంది. నిధులకు కొరతేమీ లేదు’’అని వాస్తవ పరిస్థితిని కేకిమిస్త్రి వివరించారు. అంటే కంపెనీలకు రుణా లు తగినంత లభించకపోవడానికి నిధుల సమస్య కాదని, రిస్క్‌ విషయంలో మారిన బ్యాంకుల వైఖ రే కారణమని ఆయన పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది. రుణాల విషయంలో రిస్క్‌ తీసుకునేం దుకు అయిష్టంగా ఉన్నంత కాలం ఆరి్థక వ్యవస్థపై ప్రభావం చూపిస్తూనే ఉంటుందని మిస్త్రి అన్నారు.

మరిన్ని వార్తలు