ఇండియా సిమెంట్స్‌పై దమానీ కన్ను

18 Jun, 2020 06:19 IST|Sakshi

టేకోవర్‌కు యత్నాలు...కంపెనీలో ఇప్పటికే 20% వాటాలు

ప్రధాన వాటాదారు శ్రీనివాసన్‌తో చర్చలు

న్యూఢిల్లీ: డీమార్ట్‌ సూపర్‌మార్కెట్‌ చెయిన్‌తో రిటైల్‌ రంగంలో సంచలనం సృష్టించిన ప్రముఖ ఇన్వెస్టరు రాధాకిషన్‌ దమానీ తాజాగా ఇండియా సిమెంట్స్‌పై దృష్టి సారించారు. కంపెనీని టేకోవర్‌ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాన షేర్‌హోల్డరు ఎన్‌ శ్రీనివాసన్‌తో సంప్రతింపులు కూడా జరిపినట్లు సమాచారం. ఇండియా సిమెంట్స్‌లో నియంత్రణ స్థాయి వాటాలు దక్కించుకునేందుకు చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో శ్రీనివాసన్‌కు 29 శాతం వాటాలు ఉన్నాయి. బలవంతపు టేకోవర్ల సమస్య ఎదురుకాకుండా శ్రీనివాసన్‌ ఇతర ఇన్వెస్టర్ల వైపు కూడా చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బలవంతపు టేకోవర్‌ కాకుండా మేనేజ్‌మెంట్‌లో స్నేహపూర్వక మార్పు జరిగే విధంగానే టేకోవర్‌ ఉండేట్లు చూస్తానంటూ దమానీ హామీ ఇచ్చినట్లు వివరించాయి. దమానీకి చెందిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించగా, ఇండియా సిమెంట్స్‌ ఈ సమాచారం సరైనది కాదంటూ పేర్కొంది.

క్రమంగా షేర్లు పెంచుకుంటూ..
దమానీ, ఆయన కుటుంబ సభ్యులు ఇండియా సిమెంట్స్‌లో గత కొన్నాళ్లుగా క్రమంగా షేర్లు పెంచుకుంటూ ఉన్నారు. మార్చి 31 నాటికి వారి వాటాలు సుమారు 20 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ డీల్‌ గానీ సాకారమైన పక్షంలో దమానీ పోర్ట్‌ఫోలియోను మరింత డైవర్సిఫై చేసుకోవడానికి వీలవుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇక అల్ట్రాటెక్‌ సిమెంట్, లఫార్జ్‌హోల్సిమ్‌ వంటి పోటీ దిగ్గజాలను ఎదుర్కొనేందుకు ఇండియా సిమెంట్స్‌కు కూడా గట్టి ఇన్వెస్టరు మద్దతు లభించగలదని పేర్కొన్నాయి.  74 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఇండియా సిమెంట్స్‌కు గతేడాది నాటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి.  

ఇండియా సిమెంట్స్‌ షేర్‌ రయ్‌..
టేకోవర్‌ వార్తలతో బుధవారం ఇండియా సిమెంట్స్‌ షేరు ధర సుమారు 4.72 శాతం పెరిగి రూ. 131.95 వద్ద క్లోజయ్యింది. మరోవైపు, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు 2.6 శాతం క్షీణించి రూ. 2,342 వద్ద క్లోజయ్యింది. ఇండియా సిమెంట్స్‌ షేరు ఈ ఏడాది మార్చి నాటి కనిష్ట స్థాయిల నుంచి 74 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 95 శాతం ఎగిసింది. 2019 సెప్టెంబర్‌ క్వార్టర్‌ నుంచి ఇండియా సిమెంట్స్‌ షేర్లను దమానీ గణనీయంగా కొనడం మొదలుపెట్టారు. అప్పట్లో ఆయన వాటా 1.3 శాతంగా ఉండేది. డిసెంబర్‌ క్వార్టర్‌ వచ్చేటప్పటికి 4.73 శాతానికి పెరిగింది. మార్చి క్వార్టర్‌లో సోదరుడు గోపీకిషన్‌ శివకిషన్‌ దమానీతో కలిపి 15.16% వాటాలు కొనుగోలు చేయడంతో ఇది 19.89 శాతానికి చేరింది.

మరిన్ని వార్తలు