రోబో సిలికాన్‌ మరో 9 ప్లాంట్లు

20 Sep, 2018 01:04 IST|Sakshi

రెండేళ్లలో రూ.90 కోట్ల పెట్టుబడి 

కంపెనీ సీఈవో సుమ్నేష్‌ ఖండెల్వాల్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రోబో బ్రాండ్‌తో ఇసుక తయారీ, విక్రయంలో ఉన్న రోబో సిలికాన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్, నాగ్‌పూర్, విజయవాడ, బెంగళూరు, మంగళూరు, దాద్రిలో మొత్తం 11 ప్లాంటున్నాయి. రెండేళ్లలో మరో 9 తయారీ కేంద్రాలను స్థాపించనున్నట్టు రోబో సిలికాన్‌ సీఈవో సుమ్నేష్‌ ఖండెల్వాల్‌ తెలిపారు. ఫైనాన్స్‌ హెడ్‌ అమిత్‌ జైన్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్లాంట్ల రాకతో మరిన్ని నగరాలకు విస్తరించినట్టు అవుతుందని చెప్పారు. ‘ఒక్కో కేంద్రానికి రూ.10 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతి సెంటర్లో 35–40 మందికి ఉపాధి లభిస్తుంది.

2017–18లో రూ.125 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశాం. ఈ ఏడాది రెండింతలు ఆశిస్తున్నాం. చాలా ప్రాంతాల్లో సహజ ఇసుక విక్రయాలపై నియంత్రణ ఉంది. దీంతో రాతి ఇసుకకు మంచి డిమాండ్‌ ఉంటోంది. పైగా నది ఇసుకతో పోలిస్తే రాతి ఇసుక ధర ప్రాంతాన్నిబట్టి 40–50 శాతం తక్కువగా ఉంటుంది. కంపెనీ విక్రయాల్లో 50 శాతం ఒక్క హైదరాబాద్‌ మార్కెటే కైవసం చేసుకుంది’ అని వివరించారు. రోబో సిలికాన్‌లో ట్రూ నార్త్‌గా పేరు మార్చుకున్న ఇండియా వాల్యూ ఫండ్‌కు 77 శాతం వాటా ఉంది. 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.  

మరిన్ని వార్తలు