రోజారీ బయోటెక్‌- ఐపీవో 13 నుంచే..

8 Jul, 2020 13:00 IST|Sakshi

లాక్‌డవున్‌ తదుపరి తొలి పబ్లిక్‌ ఇష్యూ

జులై 13న ప్రారంభం-15న ముగింపు

ఐపీవో ధరల శ్రేణి షేరుకి రూ. 423-425

రూ. 495 కోట్ల సమీకరణ లక్ష్యం

కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డవున్‌ ప్రకటించాక మళ్లీ పబ్లిక్‌ ఇష్యూ సందడి మొదలుకానుంది. ఇందుకు స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ రోజారీ బయోటెక్‌ శ్రీకారం చుడుతోంది. ఐపీవో ఈ నెల 13న ప్రారంభంకానుంది. ఇష్యూకి ధరల శ్రేణిని షేరుకి రూ. 423-425గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 16న ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్ పేమెంట్స్‌ లిస్టయ్యాక తిరిగి ఓ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకి రావడం గమనార్హం. కోవిడ్‌-19 కారణంగా ఇటీవల పలు కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వెనుకాడుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ. 10,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. 

రూ. 2 ముఖ విలువ
రూ. 2 ముఖ విలువతో వస్తున్న రోజారీ బయోటెక్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 15న ముగియనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువ మించకుండా ఏకమొత్తంగా దరఖాస్తు చేయవచ్చు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రోజారీ బయో రూ. 494-496 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులతోపాటు.. వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.  ఇష్యూలో భాగంగా 1.05 కోట్ల షేర్లతోపాటు తాజాగా రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూ విజయవంతంగా పూర్తయితే..  ఈ నెల(జులై) 23కల్లా రోజారీ బయోటెక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

3 విభాగాలలో
రోజారీ బయోటెక్‌ ప్రధానంగా మూడు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గృహ పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ(హోమ్‌, పెర్సనల్‌ కేర్‌) ప్రొడక్టులతోపాటు.. పెర్ఫార్మెన్స్‌ కెమికల్స్‌నూ తయారు చేస్తోంది. టెక్స్‌టైల్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా జంతు సంరక్షణ, బలవర్ధక ఉత్పత్తులు(యానిమల్‌ హెల్త్‌, న్యూట్రిషన్‌ ప్రొడక్ట్స్‌)ను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులను సబ్బులు, డిటర్జెంట్లు, పెయింట్లు, టైల్స్‌, పేపర్‌, టెక్స్‌టైల్స్‌ తదితర రంగాలలో వినియోగిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. కంపెనీకి హెచ్‌యూఎల్‌, ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌, అరవింద్‌ తదితర దిగ్గజ కంపెనీలు కీలక కస్టమర్లుగా నిలుస్తున్నాయి. అయితే కంపెనీ కార్యకలాపాలు కలిగిన రంగాలలో ఆర్తి ఇండస్ట్రీస్‌, గలాక్సీ సర్ఫెక్టాంట్స్‌, వినతీ ఆర్గానిక్స్‌ తదితర లిస్టెడ్‌ కంపెనీలు ప్రధాన ప్రత్యర్దులుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

2020లో ఇలా
గతేడాది(2019-20)లో రోజారీ బయోటెక్‌ రూ. 604 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 104 కోట్లను అధిగమించగా.. నికర లాభం రూ. 65 కోట్లను తాకింది. కంపెనీ ఉత్పత్తులను గృహ, వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీలో వినియోగిస్తున్నందున నిత్యావసర కేటగిరీలోకి చేరుతుందని యాక్సిస్‌ క్యాపిటల్‌ పేర్కొంది. దీంతో సిల్వస్సాలోని ప్లాంటు కోవిడ్‌-19 లాక్‌డవున్‌లోనూ తయారీని కొనసాగించినట్లు తెలియజేసింది.

మరిన్ని వార్తలు