ఐపీవో బాటలో గ్రామీణ బ్యాంకులు

29 Jul, 2019 11:29 IST|Sakshi

ఈ ఏడాదే 3–4 బ్యాంకుల పబ్లిక్‌ ఇష్యూ!

న్యూఢిల్లీ: ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) కొన్నింటిని స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్‌ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయ్యాక ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3–4 ఆర్‌ఆర్‌బీల పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు 45 దాకా ఉన్న ఆర్‌ఆర్‌బీల సంఖ్యను విలీన ప్రక్రియ ద్వారా 38కి తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అనుమతులివ్వడంతో మరికొన్ని ఆర్‌ఆర్‌బీల విలీనం కూడా జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. వ్యయాలు తగ్గడం, టెక్నాలజీని మెరుగ్గా వినియోగించుకోగలగడం, మూలధన పరిమాణాన్ని.. కార్యకలాపాల విస్తృతిని పెంచుకోవడం ప్రాతిపదికగా రాష్ట్రాల పరిధిలోని ఆర్‌ఆర్‌బీల విలీనం జరుగుతోందని పేర్కొన్నాయి. గడిచిన కొద్ది నెలల్లో 21 బ్యాంకుల విలీనం జరిగినట్లు తెలిపాయి. 

రైతులకు బాసటగా ఏర్పాటు..
గ్రామీణ ప్రాంతాల్లోని సన్నకారు రైతులు, వ్యవసా య కూలీలు, చేతి వృత్తులు మొదలైనవారికి రుణా లతో పాటు ఇతరత్రా ఆర్థిక సేవల సదుపాయాలను అందించే లక్ష్యంతో 1976 ఆర్‌ఆర్‌బీ చట్టం కింద గ్రామీణ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. 2005 నుంచి దశలవారీగా ఆర్‌ఆర్‌బీల కన్సాలిడేష¯Œ ను కేంద్రం అమలు చేస్తోంది. దీంతో 2005 మార్చి ఆఖరుకు 196గా ఉన్న ఆర్‌ఆర్‌బీల సంఖ్య 2012 నాటికి 82 స్థాయికి తగ్గింది.  ప్రస్తుతం ఆర్‌ఆర్‌బీల్లో 50% వాటా కేంద్రానికి, 35% వాటా స్పాన్సర్‌ బ్యాంకులు, 15% వాటా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉంటోంది. 2015 నాటి చట్ట సవరణ ప్రకారం ఈ బ్యాంకులు కేంద్రం, రాష్ట్రాలు, స్పాన్సర్‌ బ్యాంకులతో పాటు ఇతరత్రా మార్గాల ద్వారా కూడా పెట్టుబడి సమకూర్చుకోవచ్చు. 2019–20 బడ్జెట్‌లో ఆర్‌ఆర్‌బీలకు కేంద్రం రూ. 235 కోట్ల అదనపు మూలధనం కేటాయించింది. చట్టం ప్రకారం ఒకవేళ ఐపీవోకి వచ్చినా ఆర్‌ఆర్‌బీల్లో కేంద్రం, స్పాన్సర్‌ బ్యాంకుల వాటాలు 51 శాతానికి తగ్గకూడదు.

మరిన్ని వార్తలు