నిధులిచ్చి సంస్థను కాపాడండి!

16 Apr, 2019 00:32 IST|Sakshi

ఇది 20 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు 

బ్యాంకులకు, ప్రధానికి జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్ల అభ్యర్థన  

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక కింద ఇస్తామన్న రూ.1,500 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్ల సమాఖ్య నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ కోరింది. కంపెనీ మూతబడితే 20,000 పైచిలుకు సిబ్బంది రోడ్డున పడే ప్రమాదం ఉందని, వారిని ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది కూడా. ‘జెట్‌ కార్యకలాపాలు యథాప్రకారం సాగించేందుకు వీలుగా రూ.1,500 కోట్ల నిధులను విడుదల చేయాలని ఎస్‌బీఐని కోరుతున్నాం. అలాగే, 20,000 పైచిలుకు ఉద్యోగాలు కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థిస్తున్నాం’’ అని నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ (ఎన్‌ఏజీ) వైస్‌ ప్రెసిడెంట్‌ అదీమ్‌ వలియాని చెప్పారు. సోమవారమిక్కడ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో సమావేశమైన సందర్భంగా ఆయన విలేకరులతో ఈ విషయాలు చెప్పారు. సంక్షోభంలో ఉన్న సంస్థకు సంఘీభావం తెలిపేందుకు పైలట్లు, ఇంజనీర్లు, క్యాబిన్‌ సిబ్బంది తదితర ఉద్యోగులు కంపెనీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.  

దాదాపు రూ. 8,000 కోట్ల పైగా బాకీ పడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్య అధికారాలను బ్యాంకుల కన్సార్షియం తన చేతుల్లోకి తీసుకోవటం తెలిసిందే. కొత్త ఇన్వెస్టరు వచ్చే దాకా కంపెనీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా రూ.1,500 కోట్లు సమకూర్చేలా బ్యాంకులు ప్రతిపాదనలు చేశాయి. ఇప్పటిదాకా కేవలం రూ.300 కోట్లు.. అది కూడా విడతలవారీగా చిన్న మొత్తాల్లోనే ఇచ్చాయి. తాజాగా తక్షణం అత్యవసరంగా ఎంత ఇవ్వాలన్న దానిపై గత శుక్రవారం ఎయిర్‌లైన్‌ మేనేజ్‌మెంట్, ఎస్‌బీఐ మధ్య జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు.  

బ్యాంకుల నిర్ణయం నేటికి వాయిదా.. 
జెట్‌కు అత్యవసరంగా నిధులు సమకూర్చే అంశంపై సోమవారం జరిగిన సమావేశంలో కూడా బ్యాంకర్లు తగు నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో మంగళవారం మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. కంపెనీ సిబ్బందికి అంతర్గతంగా రాసిన లేఖలో జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో వినయ్‌ దూబే ఈ విషయాలు వెల్లడించారు. నిధులు అందుబాటులోకి రాకపోవడంతో విదేశీ రూట్లలో ఫ్లయిట్స్‌ రద్దును ఏప్రిల్‌ 18 దాకా పొడిగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ‘సోమవారం సమావేశంలో నిధుల విడుదల చేస్తారని ఆశించాం. అలా జరగకపోవడం నిరాశపర్చింది. మంగళవారం కూడా నిధులు అందకపోతే కంపెనీ కొనసాగే పరిస్థితులైతే కనిపించడం లేదు‘ అని పైలట్ల యూనియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

మరిన్ని వార్తలు