రూ. 2వేల దాకా డెబిట్‌ కార్డు చెల్లింపులపై చార్జీలు నిల్‌

2 Jan, 2018 01:18 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డెబిట్‌ కార్డులు, భీమ్‌ యాప్‌ ద్వారా రూ.2,000 దాకా చెల్లింపులపై లావాదేవీల చార్జీలను రద్దు చేసింది. ఇటు కొనుగోలుదారులకు అటు వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా సదరు మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) చార్జీల భారాన్ని ప్రభుత్వమే రెండేళ్ల పాటు భరించనున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌.. మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘డిజిటల్‌ చెల్లింపులకు ఊతమిచ్చే దిశగా రూ.2,000 దాకా డెబిట్‌ కార్డులు/భీమ్‌ యాప్‌ లేదా ఆధార్‌ ఆధారిత పేమెంట్‌ సిస్టమ్స్‌ ద్వారా చేసే చెల్లింపులపై లావాదేవీల చార్జీలను ప్రభుత్వమే బ్యాంకులకు రీయింబర్స్‌ చేస్తుంది. దీనితో వ్యాపారస్తులపై కూడా ఎలాంటి భారమూ ఉండదు‘ అని ఆయన పేర్కొన్నారు. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. తాజా నిర్ణయంతో ఖజానాపై రూ. 2,512 కోట్ల మేర ప్రభావం పడనుంది. 

మరిన్ని వార్తలు