హైదరాబాద్‌లో పీఎన్‌బీ ‘గాంధీగిరి’

27 Apr, 2018 00:12 IST|Sakshi
ఇంజనీరింగ్‌ కాలేజీ ముందు మిషన్‌ గాంధీగిరి బృందం ప్రదర్శన

రూ.27 కోట్ల ఎన్‌పీఏ రికవరీ!

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  మొండి బకాయిలు (ఎన్‌పీఏ) రికవరీ కోసం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) సంధించిన గాంధీగిరి అస్త్రం బాగానే పనిచేస్తోంది. గతేడాది కాలంగా హైదరాబాద్‌లో మిషన్‌ గాంధీగిరితో రూ.27.27 కోట్ల బకాయిలను రికవరీ చేసింది. ఇందులో హైదరాబాద్, వైజాగ్‌లల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి రూ.12.52 కోట్లు, ప్రముఖ జువెల్లరీ షాప్‌ నుంచి రూ.9 కోట్లు రికవరీ చేసినట్లు బ్యాంక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 

దేశంలో 1,084 మంది ఎగవేతదారులు.. 
రుణ రికవరీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్, డాటా అనలిటిక్స్‌ వంటి నిర్వహణ కోసం ప్రముఖ క్రెడిట్‌ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 1,084 మంది రుణ ఎగవేతదారుల పేర్లను ప్రకటించింది. ఇందులో 260 మంది ఫొటోలను డిఫాల్టర్లంటూ వార్తా పత్రికల్లో ప్రచురించింది కూడా. గత కొన్ని నెలలుగా 150 మంది డిఫాల్టర్ల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుంది. గత 9 నెలల కాలంలో 37 మంది డిఫాల్టర్ల మీద ఎఫ్‌ఐఆర్‌ కేసులను నమోదు చేసింది కూడా. 

ప్లకార్డులతో గాంధీగిరి ప్రదర్శన.. 
గతేడాది మేలో పీఎన్‌బీ మిషన్‌ గాంధీగిరిని ప్రారంభించింది. పీఎన్‌బీ అన్ని సర్కిళ్లలో మిషన్‌ గాంధీగిరి కోసం ప్రత్యేక బృందాలను నియమిం చారు. ప్రస్తుతం 1,144 ఫీల్డ్‌ స్టాఫ్‌ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. రుణ ఎగవేతదారుల పేర్లను, ఫొటోలను సమాజంలోకి తీసుకొచ్చి వారి పరువును బజారుకీడ్చి రుణ వసూలు చేయడమే ఈ మిషన్‌ గాంధీగిరి లక్ష్యం. సర్కిల్‌లోని ఎన్‌పీఏ సంఖ్యను బట్టి రోజు లేదా వారం వారీగా బృందం పర్యటన ఉంటుంది. 

మిషన్‌ గాంధీగిరి ఎలా పనిచేస్తుందంటే.. ఎగ వేతదారుల ఇళ్లకు, ఆఫీసులకు గాంధీగిరి బృందం వెళ్లి నిశ్శబ్దంగా కూర్చుంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఎగవేతదారుడని తెలిసేలా ప్లకార్డులు, టీ–షర్టులు, క్యాప్‌లను ప్రదర్శిస్తుంటారు. ‘‘ఇది ప్రజల సొమ్ము– దయచేసి తిరిగి రుణాన్ని కట్టేయండని’’ ప్లకార్డుల మీద రాసి ఉంటుంది. ఎగవేతదారుల కార్ల మీద రికవరీ టీం డిఫాల్టర్‌ అని రాసిపెట్టేస్తారు. 

మరిన్ని వార్తలు