రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు

16 Mar, 2014 03:26 IST|Sakshi
రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు

ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.  కొత్త మోడల్స్ అందించడం, పరిశోధన.. అభివృద్ధి, మార్కెటింగ్ తదితర కార్యకలాపాల కోసం వీటిని వెచ్చించనుంది. భవిష్యత్ పెట్టుబడులపై, గుజరాత్‌లో కొత్త ప్లాంట్‌పై శనివారం సమావేశమైన మారుతీ సుజుకి ఇండియా డెరైక్టర్ల బోర్డ్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.

మారుతీ మాతృసంస్థ సుజుకీ మోటార్స్ చైర్మన్ ఒసాము సుజుకి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పెట్టుబడులు రూ. 3,000 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, వివాదాస్పద గుజరాత్ ప్లాంట్ అంశంపై మైనారిటీ వాటాదారుల ఆమోదం తీసుకోవాలని డెరైక్టర్ల బోర్డు నిర్ణయించినట్లు సంస్థ చైర్మన్ ఆర్.సి. భార్గవ తెలిపారు. ఈ నిర్ణయానికి కంపెనీ ఇండిపెండెంట్ డెరైక్టర్లు మద్దతు పలికారు. సాధారణంగా  కంపెనీ బోర్డ్ తీసుకున్న నిర్ణయాలకు మైనారిటీ వాటాదారుల ఆమోదం పొందాల్సిన అవసరం లేకపోయినా, కార్పొరేట్ గవర్నెన్స్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని భార్గవ పేర్కొన్నారు. 

44 శాతంగా ఉన్న మైనారిటీ వాటాదారుల ఆమోదం పొందగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమోదం పొందుతామని, ఈ ఆమోదం పొందే ప్రక్రియ ప్రారంభించడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని కంపెనీ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. 32.8% మైనారిటీ వాటాదారులు అనుకూలంగా ఓటు వేస్తేనే తాజా ప్రతిపాదనలు ఓకే అవుతాయి. కాగా మైనారిటీ వాటాదారుల ఆమోదం పొందాలన్న  నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఫండ్‌హౌస్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. పూర్తి వివరాలను పరిశీలిస్తున్నామని, ఇతర ఫండ్ హౌజ్‌లతో చర్చించి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.  అటు, ఎస్‌ఎక్స్4 ఎస్-క్రాస్ కారును ఈ ఏడాది, కొత్త కాంపాక్ట్ స్పోర్ట్ యుటిలిటీ వాహనాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చని భార్గవ వివరించారు. 

>
మరిన్ని వార్తలు