పసిడి మళ్లీ జోరు పుంజుకుంది

13 Aug, 2015 08:58 IST|Sakshi
పసిడి మళ్లీ జోరు పుంజుకుంది

ముంబై : పసిడి మళ్లీ జోరు పుంజుకుంది. తక్షణ అంతర్జాతీయ, జాతీయ పరిణామాలు దీనికి కారణంగా ఉన్నాయి. ముంబై బులియన్ మార్కెట్‌లో రెండు రోజుల్లో పసిడి ధర 10 గ్రాములకు  రూ.750  పెరిగింది. బుధవారం ఇక్కడి బులియన్ స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.350 పెరిగి రూ.25,750కి చేరింది. 22 క్యారెట్ల ధర సైతం అంతే ఎగసి రూ.25,600కు చేరింది. ఢిల్లీలో ధరలు తిరిగి రూ.26,000పైబడ్డాయి. దేశంలోని పలు బులియన్ స్పాట్ మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కాగా వెండి కూడా పసిడి బాటలోనే ముంబై స్పాట్ మార్కెట్‌లో రూ.500 ఎగసి రూ.36,240కి చేరింది.

 అంతర్జాతీయంగా : కడపటి సమాచారం అందే సరికి  న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఔన్స్ (31.1 గ్రా) పసిడి ధర 14 డాలర్ల లాభంతో 1,122 డాలర్లు పలుకుతోంది. వెండి కూడా 15 డాలర్ల పైన ట్రేడవుతోంది. దీనికి అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో10 గ్రా.  ధర  రూ.550 లాభంతో రూ.25,965 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా రూ.800 లాభంతో రూ.36,091 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగి, రూపాయి బలహీనత కూడా తోడయితే గురువారం స్పాట్ బులియన్ మార్కెట్‌లో పసిడి భారీగా లాభపడే అవకాశం ఉంది.

 చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గింపు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ధోరణి, భారత్ మార్కెట్‌కూ నష్టాలు, రూపాయి బలహీనత వంటి అంశాలు పసిడి జోరుకు కారణమవుతున్నాయి.

>
మరిన్ని వార్తలు