జూన్‌లో రూ. 90,917 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు

1 Jul, 2020 14:34 IST|Sakshi

నిలకడగానే..

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడుతున్నా లాక్‌డౌన్‌లకు సడలింపులు ఇవ్వడంతో జూన్‌లో జీఎస్‌టీ వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. స్థూల జీఎస్‌టీ వసూళ్లు 90,917 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ఇందులో  కేంద్ర వాటా 18,980 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర జీఎస్‌టీ వాటా 23,970 కోట్ల రూపాయలు. ఇక ఉమ్మడి జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) 40,302 కోట్ల రూపాయలు. జీఎస్‌టీ స్ధూల రాబడిలో 7665 కోట్లు సెస్‌ కాగా వస్తువుల దిగుమతిపై 607 కోట్ల పన్ను రాబడి సమకూరింది. ఇక ఐజీఎస్‌టీలో 13,325 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి, 11,117 కోట్ల రూపాయలు ఎస్‌జీఎస్‌టీగా ప్రభుత్వం క్లియర్‌ చేసింది.

సెటిల్‌మెంట్‌ అనంతరం జూన్‌ మాసంలో కేంద్ర ప్రభుత్వం 32,305 కోట్ల రూపాయల రాబడిని, రాష్ట్రాలు  35,087 కోట్ల రూపాయల రాబడిని ఆర్జించాయి. గత ఏడాది ఇదే నెలలో ప్రభుత్వం ఆర్జించిన జీఎస్‌టీ రాబడిలో దాదాపు 91 శాతం తాజాగా వసూలవడం గమనార్హం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌-19 ప్రభావంతో పాటు జీఎస్‌టీ రిటన్‌ల దాఖలు, పన్ను చెల్లింపులపై ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో జీఎస్‌టీ వసూళ్లు దెబ్బతిన్నా క్రమంగా వసూళ్లు ఊపందుకోవడం ఊరట ఇస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 32,294 కోట్ల రూపాయల జీఎస్‌టీ వసూలుకాగా, మేలో 62,009 కోట్ల రూపాయల వసూళ్లు నమోదవడం విశేషం.

చదవండి : ఇకపై పాప్‌కార్న్‌ కొనాలంటే చుక్కలే!

మరిన్ని వార్తలు