పుంజుకున్న రూపాయి

11 Jul, 2013 03:54 IST|Sakshi
Rupee

ముంబై: రిజర్వ్ బ్యాంక్, సెబీ తీసుకుంటున్న చర్యలతో రూపాయి మారకం విలువ కాస్త మెరుగుపడుతోంది. బలపడే ట్రెండ్‌ను వరుసగా రెండో రోజూ కొనసాగిస్తూ.. బుధవారం మరో 49 పైసలు పెరిగి 59.65 వద్ద ముగిసింది. జూన్ 28 తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. విదేశీ ఇన్వెస్టర్లు షేర్లను కొనుగోలు చేస్తుండటం వల్ల ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ నిధులు తరలిరావడం కూడా రూపాయి పెరుగుదలకు దోహదపడిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. కరెన్సీ హెచ్చుతగ్గులను కట్టడి చేసే దిశగా.. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తమకు కావాల్సిన డాలర్లను ఒకే బ్యాంకు నుంచి తీసుకోవాల్సిందిగా ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.
 
 మరోవైపు, సెబీ సైతం కరెన్సీ డెరివేటివ్స్ మార్కెట్‌లో నిబంధనలు కఠినతరం చేసింది. వీటికితోడు యూరో కూడా రికవర్ కావడం వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరికాస్త బలపడిందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా చెప్పారు.
 
 ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 60.14తో పోలిస్తే మెరుగ్గా బుధవారం 59.99 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. తర్వాత 59.63 గరిష్ట స్థాయికి కూడా వెళ్లి చివరికి 0.81% లాభంతో 59.65 వద్ద ముగిసింది. గడచిన రెండు రోజుల్లో దేశీ కరెన్సీ 96 పైసల మేర (1.58%) బలపడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం వివరాలు వెల్లడయ్యాక ఫారెక్స్ మార్కెట్లకు దిశానిర్దేశం జరగగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ చెప్పారు.
 

మరిన్ని వార్తలు