-

60 దిగువకు రూపాయి

29 Mar, 2014 01:39 IST|Sakshi
60 దిగువకు రూపాయి

ముంబై: ఎట్టకేలకు దేశీ కరెన్సీ 60 దిగువకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 40 పైసలు బలపడటంతో ఎనిమిది నెలల తరువాత మళ్లీ 59.91కు చేరింది. ఇంతక్రితం జూలై 29న మాత్రమే ఈ స్థాయిలో 59.41 వద్ద ముగిసింది. ప్రధానంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడంతో రూపాయికి బలం చేకూరుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఎగుమతిదారులు డాలర్లను విక్రయిస్తుండటం కూడా సెంటిమెంట్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలి పారు. దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు శుక్రవారంతో కలిపి 5 రోజుల్లో రూ. 7,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయడం ఇందుకు సహకరించిందని వివరించారు.

 ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం ఒక దశలో 63 పైసల వరకూ లాభపడ్డ రూపాయి 59.68 వద్ద గరిష్టాన్ని కూడా తాకింది. చివరికి 0.66%(40 పైసలు) పుంజుకుని 59.91 వద్ద స్థిరపడింది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకాకపోతే రూపాయిపై ప్రతి కూల ప్రభావంపడే అవకాశమున్నదని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రెజరర్ రమేష్ సింగ్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు