అయిదేళ్ల కనిష్టానికి రూపాయి విలువ

3 Jul, 2018 00:18 IST|Sakshi

డాలర్‌తో పోలిస్తే 68.80 వద్ద ముగింపు

ముంబై: అంతర్జాతీయంగా బలహీన ధోరణులు, దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రూపాయి పతనం కొనసాగుతోంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 34 పైసలు క్షీణించి 68.80 వద్ద క్లోజయ్యింది. ముగింపు ప్రాతిపదికన చూస్తే ఇది అయిదేళ్ల కనిష్టం. చివరిసారిగా 2013 ఆగస్టు 28న ఈ స్థాయి వద్ద రూపాయి ముగిసింది.

గత గురువారం తొలిసారిగా కీలకమైన 69 మార్కును కూడా దాటేసి 69.10 స్థాయికి రూపాయి విలువ పడిపోయిన సంగతి తెలిసిందే. వాణిజ్య యుద్ధ భయాలు, పెరుగుతున్న కమోడిటీల ధరలతో దిగుమతి బిల్లుల భారం పెరుగుతుండటం తదితర అంశాలతో పరిస్థితి మరింత దిగజారవచ్చని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

కరెంటు అకౌంటు లోటు గతేడాదికన్నా మరో 30 బేసిస్‌ పాయింట్లు అధికంగా జీడీపీలో 2.2 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఎక్యూట్‌ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ఆర్థికవేత్త కరణ్‌ మెహ్‌రిషి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 70 స్థాయికి చేరొచ్చని  తెలిపారు. ఈ ఏడాది ఇప్పటిదాకా రూపాయి 6.6 శాతం క్షీణించింది. గతేడాది జూలైతో పోలిస్తే 8 శాతం మేర పతనమైంది.

మరిన్ని వార్తలు