4 నెలల కనిష్టానికి రూపాయి

2 Aug, 2014 00:23 IST|Sakshi
4 నెలల కనిష్టానికి రూపాయి

మరో 63 పైసలు డౌన్; 61.18 వద్ద క్లోజ్

ముంబై: అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగానూ స్టాక్ మార్కెట్ల పతనం రూపాయినీ కుదిపేసింది. డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం మరో 63 పైసలు దిగజారి 61.18 వద్ద స్థిరపడింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. మార్చి 20న రూపాయి ముగింపు 61.34 కాగా, మళ్లీ ఈస్థాయికి క్షీణించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా జనవరి 24 తర్వాత ఒక వారంలో ఇంత ఘోరంగా రూపాయి క్షీణించడం గమనార్హం. గురువారం దేశీ కరెన్సీ విలువ 49 పైసలు పడిపోయిన సంగతి తెలిసిందే.
 
అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలో మరో 10 బిలియన్ డాలర్ల కోత విధించడం.. అక్కడి ఆర్థిక వ్యవస్థ పుంజు కుంటోందన్న సంకేతాలతో డాలరు విలువ అంతర్జాతీయంగా పుంజుకుంటోంది. దీంతో కరెన్సీ డెరివేటివ్స్‌లో షార్ట్ సెల్లర్లు తమ పొజిషన్లను కవర్ చేసుకునేందుకు పురిగొల్పిందని.. వెరసి రూపాయిపై ప్రభావం చూపినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు దిగుమతిదారులు, బ్యాంకులు డాలర్ల కొనుగోలు కూడా దేశీ కరెన్సీ క్షీణతకు కారణంగా నిలిచినట్లు చెప్పారు. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 414 పాయింట్లు పతనమైన విషయం విదితమే.

మరిన్ని వార్తలు