రూపాయి... ఎనిమిది నెలల కనిష్టానికి పతనం

23 Aug, 2019 06:02 IST|Sakshi

26 పైసలు తగ్గి 71.81 వద్ద ముగింపు

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ  గురువారం 26 పైసలు పతనమై 71.81 వద్ద ముగిసింది. గడచిన ఎనిమిది నెలల కాలంలో (డిసెంబర్‌ 14న 71.90) రూపాయి ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్‌ భారీ పతనం, బయటకు వెళుతున్న విదేశీ నిధులు దీనికి కారణం. చైనా కరెన్సీ యువాన్‌ పతనం, వర్థమాన మార్కెట్‌ కరెన్సీల తీవ్ర ఒడిదుడుకులకు కారణమైంది. బలహీనధోరణిలో 71.65 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒక దశలో 71.97ను కూడా చూసింది.

అంతర్జాతీయంగా పటిష్టంగా ఉన్న క్రూడ్‌ ధరలు సైతం రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరుస్తోంది. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్‌ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. అయితే దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, డాలర్, క్రూడ్‌ ధరల పటిష్టత వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారుతున్నాయి. 

మరిన్ని వార్తలు