రూపాయి చరిత్రాత్మక పతనం

20 Mar, 2020 05:06 IST|Sakshi

ఒకే రోజు 86 పైసలు బలహీనం

75.12 వద్ద ముగింపు

ఇంట్రాడేలో ఏకంగా  75.30కి డౌన్‌  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ గురువారం భారీగా పతనమయ్యింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ఒకేరోజు రూపాయి 86 పైసలు (1.16 శాతం) బలహీనపడి 75.12 వద్ద ముగిసింది. ఇంత వరకూ రూపాయి ఈ స్థాయిని ఎప్పుడూ చూడలేదు. కోవిడ్‌–19 భయాందోళనకర పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు, దేశం నుంచి భారీగా వెనక్కు వెళుతున్న విదేశీ పెట్టుబడులు, ఆరు దేశాలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ బలోపేతం వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణాలు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..

► గడచిన ఆరు నెలల్లో (2019 సెప్టెంబర్‌ 3 తర్వాత) రూపాయి ఒకేరోజు 86 పైసలు బలహీనపడ్డం ఇదే తొలిసారి.  
► ఈ ఏడాది మార్చి ఒక్కనెలలోనే రూపాయి విలువ 4 శాతం పతనమయ్యింది.  
► బుధవారం రూపాయి ముగింపు 74.26. గురువారం 74.96 వద్ద బలహీన ధోరణిలో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. 74.70  గరిష్టం దాటి ముందుకు వెళ్లలేదు. ఒకదశలో 75.30 కనిష్టాన్ని కూడా చూసింది.  
► భారత్‌ షేర్లు, బాండ్ల నుంచి ఈ నెల్లో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. 2013 ఆర్థిక సంక్షోభ పరిస్థితుల అనంతరం ఇంత స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ ఇదే తొలిసారి.  
► బుధవారం దాదాపు 18% పడిన క్రూడ్‌ ధర, గురువారం అదే స్థాయిలో రికవరీ అవడం కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరిచింది.
► కోవిడ్‌–19 భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అన్ని పెట్టుబడుల సాధనాల నుంచీ నిధులు ఉపసంహంచుకుని డాలర్‌ కోసం వెంటబడుతున్న సంకేతాలు ఉన్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ 103 దాటేయడం గమనార్హం. 
► రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర  చూస్తే ఈ నెల 12, 13 తేదీల ఇంట్రాడేల్లో వరుసగా  74.50ని చూసినా, ఈ నెల 18వ తేదీ బుధవారం వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం  74.39. క్రూడ్‌ ధరల భారీ పెరుగుదల నేపథ్యంలో 2018 అక్టోబర్‌ 9న రూపాయి ఈ (74.39) చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. నాడు ఇంట్రాడేలో 74.45 స్థాయిని కూడా తాకింది.  
► తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది.  
► కరోనా కాటు నేపథ్యంలో కొద్ది వారాల్లో 76.20 వరకూ రూపాయి బలహీనపడే అవకాశం ఉందని కొందరి వాదన.

మరిన్ని వార్తలు