రూపాయి క్షీణత..  స్టీల్‌కు మంచి రోజులు

6 Sep, 2018 01:59 IST|Sakshi

ముంబై: పడుతున్న రూపాయి దేశీయ స్టీల్‌ రంగానికి లాభం చేకూర్చనుంది. రానున్న నెలల్లో ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందని, అదే సమయంలో దిగుమతుల ధరలు పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తుల ధరలకు ఊతం లభిస్తుందని, దీంతో మొత్తం మీద దేశ స్టీల్‌ వాణిజ్య లోటు తగ్గిపోతుందని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. రూపాయి డాలర్‌తో 71.75కు క్షీణించిన విషయం తెలిసిందే. ‘‘2018–19 మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో స్టీల్‌ ఎగమతులు 33 శాతం క్షీణించాయి.
 

అదే సమయంలో దిగుమతులు 11 శాతం పెరిగాయి. దీంతో గత రెండు సంవత్సరాలుగా ఎగుమతి దేశంగా ఉన్న భారత్, నికరంగా స్టీల్‌ దిగుమతిదారుగా మారింది. సీజన్‌ వారీగా రెండో క్వార్టర్లో వినియోగం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. అయితే, మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరుగుతుండడం, పంటలకు కనీస మద్దతు ధరల నేపథ్యంలో గ్రామీణ డిమాండ్‌ మెరుగుపడతుందన్న అంచనాలతో రానున్న నెలల్లో స్టీల్‌ వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’’ అని ఇక్రా తెలిపింది.   

మరిన్ని వార్తలు