ముగింపులో సరికొత్త ‘పతనం’ నమోదు!

28 Aug, 2018 01:10 IST|Sakshi

డాలర్‌ మారకంలో రూపాయి 70.16 వద్ద ముగింపు

ఒకేరోజు 25 పైసలు పతనం  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ మరింత బలహీన బాటలో పయనిస్తోందని, ఇది త్వరలో 72ను తాకడం ఖాయమన్న వాదనలకు సోమవారం బలం చేకూరింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో– ముగింపులో సరికొత్త పత నాన్ని నమోదుచేసుకుంది. 70.16 వద్ద ముగిసింది. సోమవారం ఒకేరోజు 25 పైసలు పడిపోయింది.  

నిజానికి 17వ తేదీ శుక్రవారం డాలర్‌  రూపాయి 70.15 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. నాడు ట్రేడింగ్‌ ఒక దశలో చరిత్రాత్మక కనిష్టం 70.40 స్థాయినీ చూసింది. అయితే అటు తర్వాత కోలుకుని 70.15 వద్ద ముగిసింది.  
20, 21 తేదీల్లో కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 30 పైసలు రికవరీ అయినా, అటు తర్వాత మళ్లీ పతన బాట పట్టింది. సోమవారం ముగింపులో తాజా కనిష్ట స్థాయి 70.16 వద్ద ముగిసింది.  
క్యాడ్‌ ఆందోళనలు, క్రూడ్‌ధరల పెరుగుదల, ఎగుమతులు పెరక్కపోవడంతో తీవ్రమవుతున్న వాణిజ్యలోటు రూపాయి తాజా పతనానికి కారణం.  
♦  అయితే రూపాయి ప్రస్తుత పతన ధోరణిలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎగుమతులకు ఇది ప్రోత్సాహకర అంశమని కొందరు ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.  
♦  సోమవారం ఒక దశలో రూపాయి విలువ 69.65కు తాకినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడేలో 70.20ని తాకింది.  
ఆసియాలోనే తీవ్ర స్థాయిలో భారత కరెన్సీ విలువ ఈ ఏడాది 9 శాతం పతనమయ్యింది.  
ఆగస్టు 17తో ముగిసన వారంలో భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు 33.2 మిలియన్‌ డాలర్లు తగ్గి 400.8 బిలియన్‌ డాలర్లకు చేరడమూ రూపాయిపై ప్రతికూలత చూపుతోంది.  గడచిన కొన్ని నెలలుగా భారత్‌ విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. రూపాయి 69 స్థాయిలో ఉన్నప్పుడు దీనిని ఈ స్థాయిలో నిలబెట్టడానికి డాలర్‌లను మార్కెట్‌లోకి ఆర్‌బీఐ పంప్‌ చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మారకపు విలువను మార్కెట్‌ విలువకు వదిలేస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
క్రాస్‌ కరెన్సీలోనూ రూపాయి బలహీనత కొనసాగింది. బ్రిటన్‌ పౌండ్‌పై 89.86 నుంచి 90.19కి పడింది. యూరోపై 80.98 నుంచి 81.53కు దిగింది. ఇక జపాన్‌ యన్‌ విషయలో 62.79 నుంచి 63.16కు చేరింది. 

>
మరిన్ని వార్తలు