ఒకేరోజు రూపాయి  59 పైసలు పతనం! 

14 May, 2019 05:02 IST|Sakshi

70.51కి డౌన్‌ ∙రెండు నెలల కనిష్టం 

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు భారీగా 59 పైసలు నష్టపోయింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 70.51 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల కనిష్టం. దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలహీనత, దేశం నుంచి బయటకు వెళుతున్న విదేశీ నిధులు, క్రూడ్‌ ధరల పటిష్ట స్థాయి వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. అమెరికా వృద్ధి సంకేతాలు, డాలర్‌ పటిష్టం వంటి అంశాలూ రూపాయికి బలహీనమవుతున్నాయి. రూపాయి బలహీనతలో 70.16 వద్ద ప్రారంభమైంది.

ఒక దశలో రూపాయి 70.53ను కూడా తాకింది. ఇదే పరిస్థితి కొనసాగితే తిరిగి రూపాయి సమీప పక్షం రోజుల్లోనే 72ను చూసే అవకాశం ఉందని విశ్లేషణ. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్‌ ధరల పతనం భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. అయితే తాజా అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్‌ బలోపేతం, క్రూడ్‌ ధరల పటిష్ట స్థాయి వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారుతున్నాయి.     

మరిన్ని వార్తలు