‘సెలవుల వారం’ అప్రమత్తత 

16 Apr, 2019 00:26 IST|Sakshi

డాలర్లకు డిమాండ్‌

25 పైసలు తగ్గిన రూపాయి

69.42 వద్ద ముగింపు

ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడర్లు పూర్తి అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ వారంలో రెండు రోజులు సెలవు దినాలు (17వ తేదీ బుధవారం మహవీర్‌ జయంతి , 19వ తేదీ శుక్రవారం గుడ్‌ఫ్రైడే) కావడం దీనికి కారణం. అంతర్జాతీయంగా అప్రమత్తత పాటించడానికి వీలుగా ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్లకోసం డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం 25పైసలు తగ్గి, 69.42 వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్‌లో 69.07 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో 69.46ను కూడా చూసింది. శుక్రవారం రూపాయి ముగింపు 69.17.  

74.39 గరిష్ట నుంచి... 
అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. రెండు నెలల క్రితం 72–70 మధ్య కదలాడింది. అయితే కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేది మోదీనేనన్న అంచనాలు, స్థిరంగా దేశంలోకి వస్తున్న విదేశీ నిధులు, ఈ నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి గత రెండు నెలలుగా సానుకూలమవుతోంది.   అయితే క్రూడ్‌ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, రూపాయి మరీ పడిపోయే పరిస్థితి ఏదీ ప్రస్తుతానికి లేదని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం ఇది 68.50–70 శ్రేణి వద్ద స్థిరీకరణ పొందుతోందని వారు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు