భారీగా పతనమైన రూపాయి

10 Aug, 2017 12:19 IST|Sakshi
భారీగా పతనమైన రూపాయి
ముంబై : డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు, ఆసియన్‌ కరెన్సీ మార్కెట్‌లలో నష్టాలు, దీనికి తోడు దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి భారీగా పెరుగుతున్న డిమాండ్‌ రూపాయి విలువను గురువారం ట్రేడింగ్‌లో భారీగా దెబ్బతీసింది. ప్రారంభం ట్రేడింగ్‌లో 26 పైసలు పడిపోయి, మరోసారి 64 స్థాయిలకు క్షీణించింది. ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోయిన డాలర్‌ ప్రస్తుతం రికవరీ అవుతోంది. బ్యాంకర్ల నుంచి డాలర్‌కు డిమాండ్‌ వెల్లువెత్తుతోంది. దీంతో రూపాయి క్షీణిస్తోందని మార్కెట్‌ విశ్లేషకులు చెప్పారు. ప్రస్తుతం 14 పైసలు బలహీన పడి 63.97వద్ద ఉంది. 
 
దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న నష్టాల ధోరణి, షెల్‌ కంపెనీలపై సెబీ దెబ్బ కూడా రూపాయిపై ప్రభావం చూపుతోంది. కాగ, బుధవారం నాటి ఫారెక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి డాలరుతో రూపాయి విలువ 21 పైసలు బలపడి 63.84 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. బెంచ్‌మార్కు సూచీలు కూడా వరుసగా నాలుగో రోజు నష్టాలు పాలవుతున్నాయి. సెన్సెక్స్‌ 141 పాయింట్లు క్షీణించి 31,657 వద్ద ఉండగా.. నిఫ్టీ ఏకంగా 52 పాయింట్లు నష్టపోతోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నిఫ్టీ 9,900 మార్కు కిందకి ఢమాలమంది. మరోవైపు టాటా మోటార్స్‌ షేర్లు భారీగా పతనమవుతునన్నాయి. ఈ కంపెనీ అంచనాలకు తగ్గ ఫలితాలను ప్రకటించకపోవడతో, గురువారం మార్కెట్‌లో టాటామోటార్స్‌ షేర్లు 6 శాతం పడిపోయి 16 నెలల కనిష్టానికి దిగజారాయి. 
మరిన్ని వార్తలు