భారీగా పెరిగిన రూపాయి  

1 Nov, 2017 10:07 IST|Sakshi

ముంబై : రూపాయి విలువ నేటి(బుధవారం) ట్రేడింగ్‌లో భారీగా పెరిగింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరు వారాల గరిష్టానికి ఎగిసింది.  వ్యాపార సానుకూలతలో భారత్‌ ర్యాంకు ఒక్కసారిగా 100కు ఎగియడంతో, దేశీయ ఈక్విటీ మార్కెట్లు బాగా లాభపడుతున్నాయి. డాలర్‌ మారకంలో 64.67 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, 64.64 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. ఉదయం 9.15 సమయంలో డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి 64.65 వద్ద ట్రేడైంది. అంటే మంగళవారం ముగింపుకు 0.15 శాతం ఎక్కువ. రూపాయి విలువతో పాటు బీఎస్‌ఈ బెంచ్‌ మార్కు సూచీలు కూడా బాగా సరికొత్త రికార్డు స్థాయిలను నమోదుచేస్తున్నాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు పైగా ఎగియగా.. నిఫ్టీ ఆల్‌-టైమ్‌ హై 10,400 మార్కును క్రాస్‌ చేసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి విలువ 4.7 శాతం లాభపడింది. 

ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు 5.81 బిలియన్‌ డాలర్లను ఈక్విటీలో, 22.54 బిలియన్‌ డాలర్లను డెట్ రూపంలో కొనుగోలు చేశారు. భారత్‌లో వ్యాపారం చేయడానికి అనువైన పరిస్థితులు (వ్యాపార సానుకూలతలు) వేగంగా మెరుగుపడుతున్నట్టు ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక పేర్కొంది. మంగళవారం విడుదల చేసిన నివేదికలో గత ఏడాది 130గా ఉన్న భారతదేశ ర్యాంక్‌ ఈ ఏడాది ఒక్కసారిగా 100కు ఎగసింది. ఇది పెద్ద విజయమే. పన్నులు, లైసెన్సింగ్‌ వ్యవస్థలో సంస్కరణలతో పాటు పెట్టుబడిదారు ప్రయోజనాల పరిరక్షణ, దివాలా సమస్యల సత్వర పరిష్కారం వంటి అంశాల్లో భారత్‌ వేగంగా పురోగమించడం ఈ ర్యాంక్‌ మెరుగుదలకు దోహదపడిందని ప్రపంచ బ్యాంకు రిపోర్టు పేర్కొంది.   

మరిన్ని వార్తలు