15నెలల కనిష్టానికి రూపాయి

7 May, 2018 14:57 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి పతనమైంది. డాలరుతో మారకంలో రూపాయి కీలక మద్దతు స్థాయి 67 మార్క్‌ దిగువకు చేరింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 26 పైసలు(0.3 శాతం) బలహీనపడి 67.13ను తాకింది.  దీంతో 15 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అటు చమురు ధరలు, ఇటు కీలక వడ్డీరేట్ల పెంపు అంచనాలు రూపాయి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు 10 సంవత్రాల బాండ్‌ ఈల్డ్స్‌ వరుసగా నాలుగోసారి కూడా పతనాన్ని నమోదు చేశాయి.  రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా   తదుపరి వారంలో ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలను (ఓఎంఓ) ప్రకటించిన తరువాత 10 సంవత్సరాల బాండ్ దిగుబడి(7.637శాతం) 13 బేసిస్ పాయింట్లు తగ్గింది. మే నెలలో రూ .10,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం శుక్రవారం  ప్రకటించింది.
ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. ఒక దశలో 92.90 వరకూ ఎగసింది. ఇది రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క దేశీ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు సైతం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.  జూన్‌ నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టనున్న పరపతి సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చన్న సంకేతాలు, ఇటీవల స్థానిక కరెన్సీల మ్యానిప్యులేషన్‌ జాబితాలో యూఎస్‌ ఆర్థిక శాఖ రూపాయిని చేర్చడం వంటి అంశాలు దేశీ కరెన్సీని ప్రభావితం చేస్తున్నట్టు కరెన్సీ మార్కెట్‌ ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా మార్చి నెలలో వాణిజ్య లోటు 28.5 శాతం (13.7 బిలియన్‌ డాలర్లు) ఎగసి 87 బిలియన్‌ డాలర్లను అధిగమించడం కూడా సెంటిమెంటును దెబ్బతీసినట్టు వ్యాఖ్యానించాయి. కాగా శుక్రవారం డాలరుతో మారకంలో రూపాయి 66.86 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు