ఆల్ టైం కనిష్టానికి రూపాయి

21 Apr, 2020 12:20 IST|Sakshi

 రూ. 76.83 వద్ద రికార్డు కనిష్టం

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు పతనాన్ని నమోదు చేసింది. మంగళవారం ఆరంభంలో 76.79 వద్ద బలహీనపడిన రూపాయి, అనంతరం   డాలరు మారకంలో 30 పైసలు తగ్గి 76.83 కు చేరుకుంది. ముడి చమురు రికార్డు పతనం, దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు వెయ్యి పాయింట్లు కుప్పకూలడంతో రూపాయి మరోసారి భారీగా నష్టపోతోంది. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.53 వద్ద స్థిరపడింది. అటు డాలరు 100 స్థాయి మార్కును అధిగమించడంతో  పెట్టుబడిదారులు రూపాయిలో అమ్మకాలకు దిగారని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. డాలర్ ఇండెక్స్ 0.20 శాతం పెరిగి 100.15 కు చేరుకుంది. (ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం)

చరిత్రలో మొదటిసారిగా యుఎస్ ముడి ఫ్యూచర్స్ మైనస్ లోకి పడిపోయింది. చమురు డిమాండ్ పతనం, కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ వారంలో కార్పొరేట్ ఆదాయాల ప్రకటన, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక నష్టం అంచనాలతో పెట్టుబడిదారుల  అప్రమత్తత కొనసాగుతుందని పేర్కొంది. డబ్ల్యుటిఐ ముడి చమురు ఫ్యూచర్స్ రికార్డు పతనాన్ని నమోదు  చేయగా, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.78 శాతం పడిపోయి బ్యారెల్కు 25.37 డాలర్లకు చేరుకుంది. అంతేకాకుండా, కరోనా కేసులు గణనీయంగా పెరగడం ఆర్థికవ్యవస్థపై భారం పడుతుందనే ఆందోళన ఉధృతమవుతోంది.  ప్రపంచవ్యాప్తంగా  24.81 లక్షలకు పైగా కేసులు నమోదుగా  భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 18,600 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా)

మరిన్ని వార్తలు