రూపాయి...  74కు చేరువలో! 

5 Oct, 2018 01:28 IST|Sakshi

ఇంట్రాడేలో 73.81కి కరెన్సీ

చివరకు 73.58 వద్ద ముగింపు

రెండూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలే..!  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. గురువారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ ఒక దశలో 73.81 స్థాయికి పతనమైనా... ఆ తర్వాత కొంత కోలుకుని 73.58 వద్ద ముగిసింది. ఇది బుధవారం ముగింపుతో పోలిస్తే 24 పైసలు ఎక్కువ. గురువారం ఇంట్రాడే, ముగింపు విలువలు రెండూ రూపాయికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. సోమవారం నుంచీ వరుసగా జరిగిన మూడు (మంగళవారం 2వ తేదీ గాంధీజీ జయంతి సందర్భంగా మార్కెట్‌ సెలవు) ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి 110 పైసలు (1.51 శాతం) కోల్పోయింది. ఏడాది ప్రారంభం నుంచీ 16 శాతం పడింది. బుధవారం మొదటిసారి రూపాయి 73 దిగువకు పడింది.

73.34 వద్ద ముగిసిన రూపాయి ఒకదశలో 73.42ను చూసి, రెండు అంశాల్లోనూ కొత్త రికార్డు స్థాయిలకు పడింది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల, అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు, దేశం నుంచి వెళ్లిపోతున్న విదేశీ పెట్టుబడులు, దీనితో కరెంట్‌ అకౌంట్‌ లోటు భయాల వంటివి రూపాయి భారీ పతనానికి దారితీస్తున్నాయి. మరోవంక రూపాయి జారిపోకుండా నిరోధించడానికి కేంద్రం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలు ఎటువంటి ఫలితాలనూ ఇవ్వడం లేదు.    

మరిన్ని వార్తలు