ఇక 75కి రూపాయి!!

8 Oct, 2018 01:04 IST|Sakshi

తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు,  

క్రూడాయిల్‌ రేట్లతో మరింత ఒత్తిడి 

73.5–75 శ్రేణిలో దేశీ కరెన్సీ 

ముంబై: పెరుగుతున్న ముడిచమురు ధరలు, స్టాక్‌ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు తదితర అంశాలు దేశీ కరెన్సీపై ఈ వారంలో మరింత ఒత్తిడి పెంచనున్నాయి. వీటి కారణంగా రాబోయే రోజుల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 75 స్థాయిని దాటేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కీలక పాలసీ రేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించాలన్న రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం, అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచడం మొదలైనవి కూడా ఇందుకు కారణం కానున్నాయి.

ఒకవేళ రిజర్వ్‌ బ్యాంక్‌ గానీ స్పాట్‌ మార్కెట్లో కొంత జోక్యం చేసుకున్న పక్షంలో రూపాయి భారీ పతనానికి కొంతమేర అడ్డుకట్ట పడొచ్చు గానీ.. మొత్తం మీద మాత్రం 73.5–75 శ్రేణిలో తిరుగాడవచ్చని విశ్లేషకులు వివరించారు. స్పాట్‌ మార్కెట్లో గత వారం 74 స్థాయిని తాకిన రూపాయి విలువ.. చివరికి మరో కొత్త రికార్డు కనిష్ట స్థాయి 73.77 వద్ద క్లోజయింది.  ‘ఆర్‌బీఐ పాలసీ, ఎన్‌బీఎఫ్‌సీలో ఒత్తిళ్లు, అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశాలు దేశీ కరెన్సీపై ఒత్తిడి ని పెంచొచ్చు. రూపాయి పతనం అడ్డుకట్టకు ఆర్‌బీఐ మార్కెట్లో జోక్యం చేసుకోవడం మరింతగా పెరగవచ్చు. దీంతో ఈ వారం డాలర్‌తో పోలిస్తే 73.5–75 స్థాయిలో తి రుగాడొచ్చు‘ అని కొటక్‌ సెక్యూరిటీస్‌ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ (కరెన్సీ, వడ్డీ రేట్ల విభాగం) అనింద్య బెనర్జీ తెలిపారు. 

మరిన్ని వార్తలు