మరింత బలపడిన రూపాయి

26 Nov, 2018 09:41 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పరుగు కొనసాగుతోంది. చమురు ధరల పతనంతో డాలరుతో మారకంలో వరుసగా 8వ రోజుకూడా ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 21 పైసలు లాభపడి 70.46 వద్ద రూపాయి ప్రారంభమైంది.  ప్రస్తుతం 32 పైసలు(0.4 శాతం)  పుంజుకుని 70.37 వద్ద ట్రేడవుతోంది.  ఇటీవల డాలరుతో మారకంలో లాభాల యూటర్న్‌ తీసుకున్న దేశీ కరెన్సీ గురువారం 70. 67వద్ద  ముగిసింది. ఇది దాదాపు 3 నెలల గరిష్టంకావడం విశేషం! తద్వారా ఆగస్ట్‌ 29 తరువాత తిరిగి రూపాయి గరిష్టస్థాయికి చేరింది.

లిక్విడిటీ మెరుగుకు వీలుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు ద్వారా  రూ. 8,000 కోట్లను వ్యవస్థలోకి విడుదల చేయడంతోపాటు.. దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర పెట్టుబడిదారులుగా నిలుస్తుండటం కూడా దేశీ కరెన్సీకి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. మరోవైపు  ఎగుమతిదారులు, బ్యాంకులు డాలర్లను విక్రయించడం కూడా దీనికి సహకరిస్తున్నట్లు ఫారెక్స్‌ నిపుణులు పేర్కొంటున్నారు.అటు ముడిచమురు ధరలు పతనంకావడం కూడా రూపాయికి బలాన్నిస్తోంది.

మరిన్ని వార్తలు