రూపాయి రెండున్నర నెలల గరిష్టం

20 Nov, 2018 01:13 IST|Sakshi

26 పైసలు లాభం

71.67కు రికవరీ

ఐదు ట్రేడింగ్‌ సెషన్ల నుంచీ వరుస లాభాలు

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ రికవరీ ధోరణి కొనసాగుతోంది. ఇంటర్‌ బ్యాంకింగ్‌ ట్రేడింగ్‌లో సోమవారం వరుసగా ఐదవ రోజు ట్రేడింగ్‌ సెషన్‌లోనూ రూపాయి బలపడింది. ఒకేరోజు 26 బలపడి 71.67కు చేరింది. ఇది పది వారాల గరిష్ట స్థాయి. విదేశీ నిధుల ప్రవాహం, గరిష్ట స్థాయిల నుంచి 20 డాలర్ల వరకూ క్రూడ్‌ ధరలు పతనం వంటి అంశాలు రూపాయి బలపడ్డానికి దారితీస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. ప్రారంభంలో 9 పైసలు నష్టంతో 72.02 వద్ద రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభమైంది.

అయితే కొన్ని ప్రధాన విదేశీ కరెన్సీలపై డాలర్‌ బలహీనత నేపథ్యంలో రూపాయి రికవరీ బాట పట్టింది. మరోపక్క రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బోర్డ్‌ సమావేశం జరుగుతుండటం గమనార్హం. అక్టోబర్‌ 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.  అయితే అటు తర్వాత ఒడిదుడుకులతో అయినా... కోలుకుంటూ వస్తోంది.  ‘‘రూపాయి ఒత్తిడికి గురవుతున్న వాస్తవమే. అయితే ఆ ఒత్తిడి కొంత తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గుదలే దీనికి కారణం’’ అని  ఆనంద్‌ రాఠీ షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌ రుషబ్‌ మారూ పేర్కొన్నారు.

రికవరీపై భిన్నాభిప్రాయాలు..
ఇదిలావుండగా, రూపాయి రికవరీపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.  2019 మార్చి నాటికి 71 వరకూ బలపడే అవకాశం ఉందని ఒక నివేదికలో రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ పేర్కొంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిల నుంచి తగ్గడం, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌తో 75 బిలియన్‌ డాలర్ల కరెన్సీ స్వాప్‌ వంటి అంశాలనుకేర్‌ నివేదిక ప్రస్తావించింది. అయితే అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగే అవకాశాల నేపథ్యంలో రాబోయే 3 నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మా రకం విలువ 76 స్థాయిని తాకొచ్చని స్విస్‌ బ్రోకరేజి సంస్థ యూబీఎస్‌ ఒక నివేదికలో పేర్కొంది.


రూపాయికి శుభ ‘అంచనా’!
2019లో డాలర్‌ బలహీనం: సిటీగ్రూప్‌
న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి పయనం ఎటు వెళుతుందోనన్న ఆర్థిక వర్గాల అంచనా, ఆందోళనల నేపథ్యంలో– ప్రముఖ ఆర్థిక సేవల దిగ్గజం సిటీగ్రూప్‌ అమెరికా డాలర్‌ కదలికకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. 2019లో డాలర్‌ గరిష్ట పరిమితికి చేరుతుందని, అటు తర్వాత వెనక్కు తిరిగే అవకాశం ఉందని సిటీగ్రూప్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇదే జరిగితే తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న భారత్‌ రూపాయికి ఇది శుభవార్తే.  కీలక అంశాలను చూస్తే...

జీ–10 దేశాల (బెల్జియం, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, బ్రిటన్‌) కరెన్సీలతో అమెరికా కరెన్సీ ఈ ఏడాది ర్యాలీ చేసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మూడు సార్లు పెంచిన ఫెడ్‌ ఫండ్‌ రేటు, కంపెనీల లాభాలు బాగుండటం దీనికి నేపథ్యం.  
అయితే వచ్చే ఏడాది డాలర్‌ బలహీనపడే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు దీనికి కారణం కావచ్చు. వచ్చే మూడు నెలల్లో మరో ఒకశాతం పెరిగినా, వచ్చే ఆరు నుంచి 12 నెలల కాలంలో జీ–10 దేశాల కరెన్సీలపై దాదాపు 2 శాతం డాలర్‌ పతనమయ్యే వీలుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా