తగ్గిన రూపాయి

23 Mar, 2017 01:22 IST|Sakshi
తగ్గిన రూపాయి

14 పైసల క్షీణతతో 65.44 వద్ద క్లోజింగ్‌  
ముంబై: దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు మళ్లీ డిమాండ్‌ నెలకొనడంతో బుధవారం రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించింది. దాదాపు 17 నెలల గరిష్ట స్థాయి దగ్గర్నుంచి తిరోగమించి.. అమెరికా డాలర్‌తో పోలిస్తే 65.44 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదిత ఆర్థిక వృద్ధి అజెండాపై అనిశ్చితి పెరిగిపోతున్న నేపథ్యంలో ఫారెక్స్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌పై కూడా ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

దిగుమతి సంస్థలు, కార్పొరేట్ల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో రూపాయి క్షీణించినట్లు వివరించాయి. అయితే, డాలర్‌ స్వతహాగా బలహీనపడటం వల్ల రూపాయి పతనానికి కొంత మేర అడ్డుకట్ట పడిందని తెలిపాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాల ప్రభావంతో ఇటు దేశీ స్టాక్‌మార్కెట్లు కూడా బుధవారం క్షీణించాయి.

బుధవారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే్చంజ్‌ (ఫారెక్స్‌) మార్కెట్లో క్రిత ముగింపు 65.30తో పోలిస్తే బలహీనంగా 65.57 వద్ద రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభమైంది. రోజంతా 65.37–65.58 శ్రేణిలో తిరుగాడింది. చివరికి 14 పైసల క్షీణతతో (0.21 శాతం) 65.44 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు