రూపాయి మళ్లీ 68 దిగువకు

3 Jan, 2017 01:25 IST|Sakshi
రూపాయి మళ్లీ 68 దిగువకు

30 పైసల క్షీణతతో 68.22 వద్ద ముగింపు
కొత్త ఏడాది తొలి రోజు రూపాయి బలహీనపడింది. డాలర్‌తో రూపాయి మారకం సోమవారం 30 పైసలు క్షీణించి 68.22 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో డాలర్ల కోసం డిమాండ్‌ బాగా ఉండటంతో రూపాయి ఈ స్థాయిలో పతనమైంది. విదేశీ నిధులు భారీగా తరలిపోతుండటంతో రూపాయిపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ట్రేడ్‌ కావడం, డాలర్ల కోసం దిగుమతిదారులు, కార్పొరేట్ల నుంచి డిమాండ్‌ భారీగా ఉండడం... రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయని ఫారెక్స్‌డీలర్‌ ఒకరు వ్యాఖ్యానించారు.

వరుసగా ఆరో ఏడాదీ పతనం
ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం నాటి ముగింపు(67.92) తో పోల్చితే సోమవారం 67.95 నష్టాల్లోనే ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. ఇంట్రాడేలో 68.25 కనిష్ట స్థాయిని తాకిన రూపాయి చివరకు 30 పైసల(0.44 శాతం) నష్టంతో  68.22 వద్ద ముగిసింది. ఇక గత ఏడాది రూపాయి 2.68 శాతం నష్టపోయింది. రూపాయి పతనం కావడం ఇది వరుసగా ఆరో ఏడాది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను పెంచిన నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు