రూపాయికి ‘రుచించని’ కేంద్రం చర్యలు

18 Sep, 2018 01:33 IST|Sakshi

ఒకేరోజు 67 పైసలు పతనం

72.51 వద్ద ముగింపు  

ముంబై: రూపాయి పతనాన్ని నిరోధించడానికి కేంద్రం శుక్రవారం తీసుకున్న పలు చర్యలు దేశీయ కరెన్సీపై సోమవారం సానుకూల ప్రభావాన్ని చూపించలేకపోయాయి. దేశీయంగా ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 67 పైసలు పతనమై   72.51 వద్ద ముగిసింది.

శుక్రవారం ముగింపు 71.84. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల పెంపునకు ఐదు సూత్రాల ప్రణాళిక, దిగుమతుల తగ్గింపు సహా ఫారెక్స్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుదలకు శుక్రవారం కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. కానీ అవి ఫారెక్స్‌ మార్కెట్‌పై కానీ, ఈక్విటీ మార్కెట్‌పై కానీ సానుకూల ప్రభావాన్ని చూపించలేకపోయాయి. మార్కెట్‌ ప్రారంభంతోటే, 66 పైసలు నష్టంతో 72.50 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 72.70 – 72.30 స్థాయిలో తిరిగింది.  

రెండు రోజుల తర్వాత మళ్లీ నీరసం...
రూపాయి గత మంగళవారం (11న) ఆల్‌టైమ్‌ కనిష్టం 72.92 స్థాయిని చూసింది.  తర్వాత కోలుకుని చివరకు 72.69 వద్ద ముగిసింది.  
   బుధవారం (12వ తేదీ) ట్రేడింగ్‌లో 51 పైసలు లాభపడి 72.18కి రికవరీ అయ్యింది.
   బుధవారం ముగింపుతో పోలిస్తే (గురువారం ఫారెక్స్‌ మార్కెట్‌ సెలవు) శుక్రవారం 34 పైసలు బలపడి 71.84 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు బాగుండడం, రూపాయి పటిష్టతకు కేంద్రం చర్యలు తీసుకోనుందన్న వార్తలు దీనికి నేపథ్యం.  
 అయితే  రెండు రోజుల పురోగమనానికి సోమవారం మళ్లీ బ్రేక్‌ పడింది.  
   క్రూడ్‌ ధరల తీవ్రత, వాణిజ్య యుద్ధం వంటి అంశాలు దేశీయ కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయి. గడచిన పక్షం రోజుల్లో దేశీయ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.9,400 కోట్లు (1.3 బిలియన్‌ డాలర్లు) వెనక్కు తీసుకోవడం కూడా ప్రస్తావనాంశం.  

రూపీ బాండ్లకు పన్ను మినహాయింపు
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్థిక మంత్రి  జైట్లీ సోమవారం మరో కీలక ప్రకటన చేశారు. భారత కంపెనీలు నిధుల సమీకరణలో భాగంగా ఇతర దేశాలలో జారీ చేసే రూపీ–డినామినేటెడ్‌ బాండ్ల వడ్డీపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా దేశీ కంపెనీల బాండ్ల కొనుగోలు పెరిగి విదేశీ నిధుల ప్రవాహం జోరందుకుంటుందని, రూపాయి బలపడేందుకు ఆస్కారం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఈనెల 17 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్యలో జారీ అయ్యే బాండ్లపై మినహాయింపు వర్తిస్తుందన్నారు. ‘దేశీ కంపెనీలు, బిజినెస్‌ ట్రస్ట్‌లు నాన్‌రెసిడెంట్స్‌కు జారీ చేసే రూపీ–డినామినేటెడ్‌ బాండ్లపై చెల్లించే వడ్డీపై పూర్తి మినహాయింపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం నేపథ్యంలో కంపెనీలు ఆదాయపన్ను చట్టం 194ఎల్‌సీ ప్రకారం ఈ తరహా బాండ్ల వడ్డీ చెల్లింపుపై డిడెక్షన్‌ చేయాల్సిన అవసరం ఉండదు.’ అని వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు