ఆర్‌బీఐ బూస్ట్‌ : రూపాయి జంప్‌

27 Aug, 2019 19:22 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ కరెన్సీ రూపాయి రికార్డు కనిష్టాలనుంచి కోలుకుంది.  డాలరు మారకంలో సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే మంగళవారం ఏకంగా 54 పైసలు జంప్‌ చేసింది.  గత అయిదు నెలల కాలంలో ఇదే అతిపెద్ద లాభంగా నిలిచింది. వారం గరిష్ట స్థాయి 71.48 వద్ద ముగిసింది. సోమవారం 36 పైసలు తగ్గి  72.02 వద్ద  తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి  చేరింది. రికార్డు స్థాయిలో రూ .1.76 లక్షల కోట్ల డివిడెండ్, మిగులు నిల్వలను ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం రూపాయికి ఊతమిచ్చిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. స్థిరమైన ఆర్థిక పరిస్థితుల  అంచనాలతో  దేశీయ కరెన్సీ పుంజుకుందని  ఇన్వెస్ట్‌మెంట్ ఎనలిస్టు సునీల్ శర్మ తెలిపారు.

ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో రూపాయి డాలర్‌కు 71.70 వద్ద అధికంగా ప్రారంభమైంది. ఇది రోజు గరిష్ట స్థాయి 71.45 ను తాకింది.  చివరకు 54 పైసలు పెరిగి 71.48 వద్ద స్థిరపడింది.  మార్చి 18, 2019  తరువాత ఒకరోజులో అతిపెద్ద లాభం. మరోవైపు ప్రధాన కరెన్సీలతో డాలరు బలహీనం రూపాయికి మద్దతిచ్చింది. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు త్వరలో తిరిగి ప్రారంభమవుతాయనే అంచనాలతో యుఎస్ డాలర్ ఇండెక్స్,  0.18 శాతం పడిపోయి 97.90 వద్దకు చేరుకుంది. అయితే, చైనా కరెన్సీ యువాన్ డాలర్‌తో పోలిస్తే 11 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది.

>
మరిన్ని వార్తలు