రూపాయి జూమ్

17 May, 2014 01:32 IST|Sakshi

ముంబై: ఎన్డీయే ఘన విజయంతో రూపాయి దూసుకుపోయింది. డాలర్‌తో పోలిస్తే 50 పైసలు పెరిగి 58.79 వద్ద ముగిసింది. ఇది 11 నెలల గరిష్టం. ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం కొనసాగించడంతో రూపాయి వరుసగా మూడో రోజూ బలపడినట్లయింది. గడచిన 3 రోజుల్లో రూపాయి మారకం విలువ మొత్తం 126 పైసలు (2.10 శాతం) పెరిగింది.

 శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 59.29 కన్నా మెరుగ్గా 59 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత 58.62 - 59.11 శ్రేణిలో తిరుగాడింది. చివరికి 0.84 శాతం లాభంతో 58.79 వద్ద ముగిసింది. 2013 జూన్ 19 తర్వాత రూపాయి మారకం విలువ ఈ స్థాయికి రావడం ఇదే ప్రథమం.

అప్పట్లో దేశీ కరెన్సీ 58.70 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 3,635 కోట్ల మేర ఈక్విటీలను కొనుగోలు చేయడం.. రూపాయి విలువ పెరిగేందుకు దోహదపడింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో భారత మార్కెట్లపై ఆశాభావం పెరిగిందని అడ్మిసి ఫారెక్స్ ఇండియా డెరైక్టర్ సురేశ్ నాయర్ చెప్పారు. రాబోయే రెండు, మూడు నెలల్లో కొత్త ప్రభుత్వం తీసుకోబోయే ఆర్థిక, ద్రవ్యపరమైన చర్యలు భారత సావరీన్ క్రెడిట్ రేటింగ్‌పై ప్రభావాలు చూపే అవకాశం ఉందని స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్స్ సర్వీసెస్ తెలిపింది.

మరిన్ని వార్తలు