రూపీ.. రికవరీ.. 16 పైసలు అప్‌

22 Aug, 2019 10:17 IST|Sakshi

71.55 వద్ద క్లోజింగ్‌

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే వర్ధమాన దేశాల కరెన్సీలు బలపడటంతో బుధవారం రూపాయి కూడా కొంత కోలుకుంది. దేశీ కరెన్సీ మారకం విలువ 16 పైసలు పెరిగి 71.55 వద్ద ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం బులిష్‌గానే ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్‌.. ఒక దశలో 71.36 గరిష్ట స్థాయిని కూడా తాకింది. చివర్లో 16 పైసలు లాభంతో ముగిసింది. దేశీ కరెన్సీ మంగళవారం ఆరు నెలల కనిష్ట స్థాయి 71.71కి పతనమైన సంగతి తెలిసిందే. ఆర్థిక అనిశ్చితి, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరుగుతుండటం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తదితర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ రూపాయి కోలుకోవడం గమనార్హమని ఫారెక్స్‌ ట్రేడర్లు పేర్కొన్నారు. ‘వరుసగా నాలుగు సెషన్లుగా బ్రెంట్‌ క్రూడ్‌ ధర పెరుగుతూనే ఉన్నప్పటికీ, డాలర్‌ ఇండెక్స్‌ అధిక స్థాయుల్లో కొనసాగుతున్నప్పటికీ రూపాయి మాత్రం గడిచిన రెండు సెషన్లలో వాటిల్లిన నష్టాలను కొంత మేర భర్తీ చేసుకోగలిగింది‘ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ (పీసీజీ, క్యాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ చెప్పారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చల ప్రభావాలపై ఇన్వెస్టర్లు ఒక అంచనాకు వస్తుండటంతో వర్ధమాన మార్కెట్‌ కరెన్సీలు కాస్త బలపడ్డాయని ఆయన వివరించారు. 

మరిన్ని వార్తలు