73కు ‘రెండు పైసల’ దూరంలో..!

19 Sep, 2018 00:00 IST|Sakshi

72.98కి రూపాయి విలువ

ఒకేరోజు 47 పైసలు పతనం

ఒక దశలో 72.99కీ పయనం

రెండు రోజుల్లో 114 పైసలు డౌన్‌

ముంబై: క్రూడ్‌ ఆయిల్‌ తీవ్రత... వాణిజ్య యుద్ధ భయాలు... డాలర్‌ ఇండెక్స్‌ బలోపేత ధోరణి... వెరసి గ్రీన్‌బ్యాక్‌గా పేర్కొనే అమెరికా కరెన్సీలో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. సోమవారం ముగింపుతో పోల్చితే మంగళవారం మరో 47పైసలు పతనమై, 72.98 వద్ద ముగిసింది. ఒకదశలో 72.99 స్థాయిని కూడా చూసింది.  ఈ రెండూ రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. మొత్తంమీద రెండు రోజుల్లో రూపాయి 114పైసలు బలహీనపడింది.

సోమవారం రూపాయి 67పైసలు నష్టపోయింది.  నిజానికి చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 10 శాతం అదనపు సుంకాలు విధించడంతో డాలర్‌ ఇండెక్స్‌ ఏడు వారాల కనిష్ట స్థాయికి (94) పడింది. అయినా ఈ ప్రభావం రూపాయిపై పడలేదు. డాలర్‌ బలపడుతుందన్న భయాలతో దిగుమతిదారుల నుంచి ఆ కరెన్సీ కోసం డిమాండ్‌ కొనసాగింది.   

వాస్తవ పతనం 7 శాతమే! : ఐఎంఎఫ్‌
వాషింగ్టన్‌: డాలర్‌లో రూపాయి మారకం విలువ పతనాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విభిన్నంగా విశ్లేషించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 13 శాతం రూపాయి విలువ పతనమయ్యిందన్న వార్తల సారాంశం. అయితే ‘వాస్తవ’ పతనం 6 నుంచి 7 శాతమేనని ఐఎంఎఫ్‌ ప్రతినిధి గ్యారీ రైస్‌ ఇక్కడ పేర్కొన్నారు. ‘‘భారత్‌ కరెన్సీ మాత్రమే కాకుండా, భారత్‌తో వాణిజ్య భాగస్వామ్యం ఉన్న పలు వర్థమాన దేశాల కరెన్సీలూ డాలర్‌ మారకంలో తగ్గాయి. ఆయా అంశాలను భర్తీ చేసుకుని పరిశీలిస్తే, రూపాయి ‘వాస్తవ’ పతనం ఈ ఏడాది ప్రారంభం నుంచీ 6 నుంచి 7 శాతమే’’ అని ఆయన విశ్లేషించారు.   

జాగ్రత్త అవసరమే!
అయితే రూపాయి పతనంపై దేశం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్‌ అభిప్రాయపడింది. ‘‘ రూపాయి పలచబడ్డం వల్ల చమురు, పెట్రోలియం ప్రొడక్టుల వంటి దిగుమతుల విలువ పెరుగుతుంది. దీనితో దేశంలో ద్రవ్యోల్బణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది’’ అని ఐఎంఎఫ్‌ విశ్లేషించింది.

మరిన్ని వార్తలు